అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ వివాదంపై మీరు కోర్టులకెక్కవచ్చునని ఆయన కాంగ్రెస్ పార్టీని సవాల్ చేశారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బిలియనీర్ గౌతమ్ అదానీని బీజేపీ వెనకేసుకు వస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ దీనిపై మేము ఏదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మేం భయపడే ప్రసక్తే లేదు.. మీరు కోర్టులకెక్కవచ్చు అని ఛాలెంజ్ చేశారు.
అదానీ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న కారణంగా ఈ వివాదంపై తాను మరింత వ్యాఖ్యానించడం సమంజసం కాదని, కోర్టు దీనిపై తన అభిప్రాయం చెబుతుందని అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అదానీ స్నేహితుడని, మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అదానీ ఆస్తుల విలువ పెరిగిపోతూ వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మొదటిసారిగా అమిత్ షా దీనిపై ఇలా స్పందించారు. లోగడ పెగాసస్ స్పై వేర్ అంశం దేశంలో వివాదం రేపినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే పసలేని ఆరోపణలు చేసిందని, దమ్ముంటే వీటికి కోర్టులో ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. కానీ వారు అలాచేయలేదన్నారు. ఏదో ఒక వివాదం రేపడమే వారి పని అని దుయ్యబట్టిన ఆయన.. కోర్టులు మా కంట్రోల్ లో ఉండవు కదా అన్నారు.
నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ పార్టీ ఒకటేనని తాను పోల్చలేదని అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటకలో జరిగిన
ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తాను వీటిని ఒకే గాటన కట్టినట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. టెర్రరిజానికి ఊతమిస్తున్న ఈ సంస్థపై ఈ చర్య తీసుకోవడం సబబేనన్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఎన్నో కేసులు ఉన్నాయని, ఆ సంస్థకు చెందిన సభ్యులపై గల కేసులను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని ఆయన చెప్పారు. నిషిద్ధ సంస్థను అదుపులో పెట్టేందుకే తాము ప్రయత్నించామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.