కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2 బీ కేటగిరీ కింద ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనని ఆయన సమర్థించారు. మత ప్రాతిపదికపై కోటా సౌకర్యం కల్పించడం రాజ్యాంగబద్ధంగా చెల్లదని అన్నారు. ఆదివారం బీదర్ జిల్లా గోరట గ్రామంలోను, రాయచూర్ జిల్లా గబ్బూర్ లోను జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడం ఓటు బ్యాంక్ రాజకీయాలకోసమేనని ఆరోపించారు.
ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి వారికోసం కొత్త అంతర్గత రిజర్వేషన్ పథకం ప్రవేశపెట్టేందుకు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘2 బీ కేటగిరీ అన్నది పూర్తిగా ముస్లిముల ప్రయోజనాలకోసం ఉద్దేశించినదే .. ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటుకాదని భావించి రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ దీన్ని రద్దు చేసింది.. ఈ 4 శాతం కోటాను రాష్ట్రంలో బలంగా ఉన్న వొక్కళిగులకు, వీర శైవ లింగాయత్ లకు 2 శాతం చొప్పున విభజిస్తూ రిజర్వేషన్ కేటగిరీలో ఉంచింది ‘అని అమిత్ షా వివరించారు.
దీంతో వొక్కలిగుల రిజర్వేషన్ 4 శాతం నుంచి 6 శాతానికి .. లింగాయత్ ల కోటా 5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. బుజ్జగింపు రాజకీయాలను బీజేపీ విశ్వసించదని, అందువల్లే కోటా విధానాన్ని ప్రభుత్వం మార్చిందని అమిత్ షా పేర్కొన్నారు.
అయితే మరి ఈ తాజా నిర్ణయాలు ..బుజ్జగింపు రాజకీయాలను ప్రతిబింబించడం లేదా అని కాంగ్రెస్ వంటి విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో వీర శైవ లింగాయత్ లు, వొక్కళిగులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లిముల ఓట్లు తమకు పడకపోవచ్చునని భావించిన బీజేపీ నేతలు .. ఇలా రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు భావిస్తున్నారు.