ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో ఎన్నికల సమీపించే కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలో మేఘాలయాలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
డాలు, రంగసకోనాలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. మేఘాలయ మాజీ సీఎంలు కేవలం వారి కుటుంబాలు, వ్యక్తిగత అభివృద్ధి కోసమే పాటు పడ్డారని ఆయన ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్దిని కోరుకుంటోందని వెల్లడించారు.
కేంద్రం అందిస్తున్న సంక్షేమ ఫలాలు మేఘాలయ ప్రజలకు అందడం లేదని ఆయన అన్నారు. దీనికి సీఎం కారకుడంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతి నెలకొందన్నారు. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 5,000 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో సరైన రహదారి లేదన్నారు. మేఘాలయను అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.