– షా దగ్గరకు ఎన్నారై కాలేజీ వ్యవహారం
– స్పెషలాఫీసర్ తో 20 నిమిషాల భేటీ
– మేఘా అక్రమాలపై షా అసహనం
– త్వరలోనే అన్నీ పరిష్కరిస్తామని హామీ
– షా ఎంట్రీతో మేఘాకు వణుకు
– ఇది ఎటు దారితీస్తుందోనని ఆందోళన
ఎన్నారై కాలేజీ వ్యవహారంలో మేఘాకు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. మొన్న సుప్రీంకోర్టు గట్టిగా గడ్డి పెట్టగా.. ఇప్పుడీ పంచాయితీ అమిత్ షా దగ్గరకు చేరింది. ట్రైబ్యునల్ నియమించిన జార్ఖండ్ మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు.. హోంమంత్రిని కలిశారు. ఎన్నారై కాలేజీలో జరుగుతున్నదంతా పూసగుచ్చినట్లు ఆయనకు వివరించారు. దాదాపు 20 నిమిషాలపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. స్పెషలాఫీసర్ గా మండవ విష్ణువర్ధన్ రావు నియామకం తర్వాత మేఘా పేట్రేగిపోయింది. ఆ పరిణామాలన్నీ విని.. ఎన్నారైలు పెట్టుబడి పెడితే ఇలా వ్యవహరిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు అమిత్ షా.
కాలేజీ వ్యవహారం, అక్రమ కేసులపై ఆరా తీసిన హోంమంత్రి.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేఘా కృష్ణారెడ్డిపై రోజుకో ఫిర్యాదు అందుతుండడంతో కేంద్రం సీరియస్ గా ఉంది. అతని అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో వేల కోట్ల రూపాయల కాలేజీని 2 వందల కోట్లకే కోట్టేయాలని చూసిన మేఘా కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లుగా అయింది. మొన్నే సుప్రీంకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్నది మేఘా సంస్థ. ఇప్పుడు కేంద్రం ఎంట్రీ ఇస్తే ఆట రసవత్తరంగా మారుతుంది.
2017లో ఎన్నారై కాలేజీని కబ్జా పెట్టేయాలని మేఘా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్స్ గ్రూపులుగా విడిపోయారు. అనేక గొడవలు జరిగాయి. ఆ తర్వాత పరిష్కార మార్గంగా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ జార్ఖండ్ మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావుని స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. కానీ, మేఘా టీం తాము చెప్పిందే నడవాలంటూ.. ఆ అధికారి పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇద్దరు ఉద్యోగుల వ్యవహారశైలిని ప్రశ్నించినందుకు మీడియా చేతిలో ఉంది కదా అని నానా రచ్చ చేశారు. పైగా ఆ నిజాయితీ గల అధికారిపై క్రిమినల్ కేసులు పెట్టించారు. పేరుకే అధికారి అయినా ఒక్కరోజు కూడా పని చేయనివ్వలేదు. కానీ, పాపం పండింది. అన్నీ గమనించిన సుప్రీం కీలక తీర్పునిచ్చింది. ఇకపై అన్ని అధికారాలు ప్రత్యేక అధికారికే ఉంటాయని తేల్చేసింది. ఇటు హైకోర్టు కూడా అదే చెప్పేసింది. విష్ణువర్ధన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసులపై ఏం చేయొద్దని స్టే విధించింది.
వేల కోట్ల కాలేజీని తక్కువకే కొట్టేయాలనుకు మేఘా కృష్ణారెడ్డి ప్లాన్ ఆఖరికి బెడిసికొట్టింది. ఇప్పుడు బంతి షా కోర్టులో ఉంది. ఎన్నారైల కాలేజీని కృష్ణారెడ్డి ఎలా కబ్జా పెట్టాడు.. నగదు బదిలీలు ఎలా జరిగాయి.. ఇలా అన్ని వివరాలు స్పెషలాఫీసర్ దగ్గర నుంచి నివేదిక తీసుకున్నారు అమిత్ షా. అలాగే తాను వచ్చినప్పటి నుంచి పెట్టిన ఇబ్బందులను సైతం ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారంపై అమిత్ షా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మేఘా ఎన్నారై కాలేజీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు సిబ్బంది. అక్కడి పరిస్థితులను చక్కబెట్టేందుకు స్పెషలాఫీసర్ ప్రయత్నిస్తుంటే.. అడ్డుపడుతూ వచ్చారని ఇప్పుడు సుప్రీం తీర్పు, షా ఎంట్రీతో తోక ముడవడం ఖాయమని భావిస్తున్నారు. వాళ్లు అలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇన్నేళ్లలో జరిగిన అరాచకాలు అన్ని ఉన్నాయి మరి. ప్రశాంతంగా ఉండాల్సిన మెడికల్ కాలేజీలో.. రోజూ ఎదో విధంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ వచ్చారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కాలేజీ పరువును బజారుకు ఈడ్చారు. ఈ తతంగాన్ని ఇన్నాళ్లూ భరించిన ఉద్యోగులు కేంద్రం దృష్టి పెట్టిందని తెలుసుకుని సంబరాల్లో ఉన్నారు. ఇటు విష్ణువర్ధన్ రావు కూడా తనపై మోపిన అక్రమ ఆరోపణలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మరింత దూకుడుగా ఇకపై పని చేసే అవకాశం ఉంది.