తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లతో ఆయన సుమారు 4 గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వారిని అడిగి షా తెలుసుకున్నారు.
రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. పార్టీలో చేరికలపై ప్రధానంగా దృష్టి సారించాలని వారికి షా ఆదేశించినట్టు తెలుస్తోంది.
అంతకు ముందు హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదని ఆయన వెల్లడించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీన్ని సాధించడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఇటీవల నక్సలిజం తగ్గు ముఖం పట్టిందన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం బాట పట్టే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిందన్నారు.