ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ జెడ్ కేటగిరి భద్రతను తీసుకోవాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయనపై జరిపిన కాల్పుల ఘటనపై రాజ్యసభలో ప్రకటన చేశారు షా. ఒవైసీ అక్కడ పర్యటిస్తున్నారని జిల్లా కంట్రోల్ రూమ్ కు ముందస్తు సమాచారం ఏదీ లేదని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని.. ఒవైసీ సేఫ్ గా బయటపడ్డారని వివరించారు.
ఘటన తర్వాత నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు అమిత్ షా. అలాగే ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నామని.. ఒవైసీ కారుపై మూడు బుల్లెట్ గుర్తులు ఉన్నాయని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. తమకున్న అంచనా ప్రకారం ఒవైసీకి ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉందని చెప్పారు. అందుకే ఆయన జెడ్ సెక్యూరిటీని స్వీకరించాలని కోరారు.
ఇటు జెడ్ సెక్యూరిటీ ప్రతిపాదనను మరోసారి తిరస్కరించారు అసద్. సీఏఏ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 22మంది కంటే తన జీవితం విలువైందేం కాదని అమిత్ షాకు తాను చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన చుట్టూ ఎవరైనా ఆయుధాలతో ఉంటే నచ్చదన్న ఆయన.. స్వేచ్ఛాజీవితమే తనకు ఇష్టమని అన్నారు.
ఈనెల 3న ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ వెళ్తుండగా అసద్ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఓ టోల్ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది.