హిందీ భాషలో ఉన్న ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలు వచ్చేశాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యప్రదేశ్ లో వీటిని లాంచ్ చేశారు. హిందీ వెర్షన్ గల మెడిసిన్ బుక్స్ రావడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి. భోపాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వాస్ కైలాస్ సారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీషు మీడియం లేని స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులకు ఇదెంతో ప్రయోజనకరమని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు.
నూతన విద్యావిధానం కింద ప్రధాని మోడీ ప్రభుత్వం హిందీకి, ఇతర భారతీయ భాషలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన తెలిపారు. విద్యార్థుల మాతృ భాషకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడమన్నది చరిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. భారత విద్యా రంగంలో ఇదెంతో ముఖ్యమైన రోజని, దీన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చునని ఆయన చెప్పారు. ఇక ఇంగ్లీష్ చదవని విద్యార్థులు, పేద స్టూడెంట్స్ జీవితాల్లో అమిత్ షా కొత్త వెలుగులు తెచ్చారని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ఇలాంటి విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ భాష కష్టమవుతుందని, ఫలితంగా చాలామంది పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. భారతీయ చరిత్ర లోనే ఇది ‘గోల్డెన్ డే’ అని ఆయన కూడా అభివర్ణించారు.
హిందీలో ఉన్న ఈ పుస్తకాలను తాము ఇతర రాష్ట్రాలకు కూడా షేర్ చేస్తామని, ఇందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతానని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ నుంచి విద్యను మేం పూర్తిగా విముక్తం చేస్తున్నాం.. అని ఆయన అంతకు ముందు చెప్పారు. విదేశీ భాషకు ఎంతకాలం బానిసలుగా ఉంటాం అన్నారు. ఐఐటీలు, ఐఐఎంఎస్ లలో కూడా హిందీ ఎడ్యుకేషన్ ని ప్రవేశపెట్టాలన్నది తన కల అన్నారాయన. అయితే ఇంగ్లీష్ భాషలోనే స్టడీ చేయాలనుకుంటున్న విద్యార్థులపై తామేమీ ఒత్తిడి తేవడం లేదని చౌహాన్ క్లారిటీ ఇచ్చారు.