యూపీ ఓటర్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరాల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తాము మరోమారు అధికారంలోకి వస్తే భూమి లేని రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే సాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ‘లోక్ కళ్యాణ్ సంకల్ప్ పాత్ర” పేరుతో మంగళ వారం ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యూపీలో బీజేపీ విజయం ఖాయమన్నారు. ‘ కొన్ని రోజుల క్రితం బీజేపీ 2017 మెనిఫెస్టో గురించి ఎస్పీ నేత అఖిలేశ్ మాట్లాడారు. మెనిఫెస్టోలోని ఏమైనా హామీలు అమలుచేశారా అని అడిగారు. మేము ఇప్పుడు దానికి సమాధానం ఇస్తున్నారు. 2017 మెనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 92శాతానికి పైగా అమలు చేశాము” అని అన్నారు.
‘ వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా అఖిలేశ్ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ను బీజేపీ వ్యాక్సిన్ అంటూ అఖిలేశ్ సంబోధించారు. వ్యాక్సిన్ తీసుకోనంటూ మొదట్లో మాట్లాడారు. కానీ చివరకు వ్యాక్సిన్ తీసుకున్న విషయం మీరు గుర్తించాలి. అఖిలేశ్ మాటలు విని ఉంటే యూపీలో కరోనా మరణాల సంఖ్య భారీగా ఉండేది” అని తెలిపారు.
హామీలు ఇవే…
భూమిలేని పేదలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే సాయాన్ని రెండురెట్లు చేయడం ( ప్రస్తుతం రూ. 6000గా ఉంది).
విద్యార్థినులు, మహిళ ఉద్యోగినులకు ఉచిత స్కూటీలు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థినులకు ఉచిత కోచింగ్ అందిచడం.
ఆన్ లైన్ క్లాసుల దృష్ట్యా విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు అందించడం.
ఉజ్వల్ యోజనా కింద ఉగాది, హోలీ లాంటి పర్వదినాల్లో రెండు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం.