అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్న విపక్షాల డిమాండ్ పై కేంద్ర హోం మంత్రి తొలిసారిగా స్పందిచారు. ఈ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన వెల్లడించారు.
ఇండియా టుడే కాంక్లేవ్-2023లో పాల్గొని ఆయన మాట్లాడుతూ… అదానీ వ్యవహారం విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే విచారణ కోసం సర్వోన్నత న్యాయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
ప్రజలు న్యాయ విధానంపై నమ్మకం ఉంచాలన్నారు. అదానీ వ్యవహారానికి సంబంధించి ఎవరి దగ్గరైనా సాక్ష్యాలు వుంటే వారు సుప్రీం కోర్టు కమిటీ ముందు వాటిని సమర్పించ వచ్చన్నారు. ఒక వేళ ఈ వ్యవహారంలో తప్పు జరిగినట్టు తేలితే నిందితులు ఎంతటి వారైనా వదలి పెట్టేది లేదన్నారు.
కమిటీ విచారణ తర్వాత కూడా నివేదిక సరైనది కాదని భావిస్తే ఎవరైనా విషయాన్ని లేవనెత్తాలి లేదా దానిపై నిరసన వ్యక్తం చేయాలన్నారు. ఈ వ్యవహారంలో సెబీ, సుప్రీం కోర్టు రెండూ సమాంతరంగా దర్యాప్తు జరుపుతున్నాయన్నారు.