జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ‘పెద్ద ప్రామిస్’ చేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని గుజ్జర్లు, బేకర్ వాల్స్ , పహారీ కులస్తులందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతాయని ప్రకటించారు. జస్టిస్ శర్మ కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ఇవి వీరందరికీ వర్తిస్తాయన్నారు. రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ఈ వర్గాలకు కోటా సమస్యను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని, గుజ్జర్లు, బేకర్ వాల్స్, పహారీ వర్గాల్లో ప్రతివారికీ ఎస్టీ కోటా రిజర్వేషన్లు తగ్గించే ప్రసక్తి లేదని చెప్పారు.
2019 లో 370 అధికరణాన్ని రద్దు చేసినందున జమ్మూ కశ్మీర్ లోని వెనుకబడిన వర్గాలవారికందరికీ రిజర్వేషన్ ప్రయోజనాల కల్పనకు మార్గం సుగమమైందన్నారు. ‘ఈ మూడు వర్గాలకూ ఎస్టీ కోటా ప్రయోజనాలు కల్పించాలని జస్టిస్ శర్మ కమిషన్ చేసిన సిఫారసులు ప్రభుత్వానికి అందాయి..లీగల్ ప్రాసెస్ పూర్తి కాగానే వీరందరికీ ఇవి లభిస్తాయి’ అని ఆయన చెప్పారు.
పహారీలకు ఎస్టీ హోదా కల్పిస్తున్నందున గుజ్జర్లను, బేకర్ వాల్స్ ని రెచ్చగొట్టడానికి కొంతమంది ప్రయత్నించారని.. కానీ వారి యత్నాలను ప్రజలు నీరుగార్చారని అమిత్ షా చెప్పారు. జమ్మూ కశ్మీర్ లోని విపక్షాలను ఆయన దుయ్యబట్టారు. గతంలో అప్పటి ఈ రాష్ట్రాన్ని మూడు రాజకీయ కుటుంబాలు ‘పాలించాయని’.. కానీ ఇప్పడు అధికారం 30 వేలమంది చేతుల్లో ఉందని ఆయన చెప్పారు.
నిజాయితీగా జరిగిన ఎన్నికల ద్వారా వీరంతా పంచాయతీలకు, జిల్లా మండలులకు ఎన్నికయ్యారని అన్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, దీని డెవెలప్మెంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను లోగడ కొందరు తమ ప్రయోజనాలకోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఇప్పుడు ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసం వాడడం జరుగుతోందన్నారు. మూడు కుటుంబాల కబంధ హస్తాల నుంచి జమ్మూ కశ్మీర్ ని విముక్తం చేయాలని ఆయన కోరారు. అయితే ఆ కుటుంబాలేవో ఆయన ప్రస్తావించలేదు.