నిర్మల్ కాషాయమయమైంది. భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ తో తలపెట్టిన సభకు భారీ స్పందన లభించింది. పార్టీ నేతలు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరై.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. టీఆర్ఎస్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ మాతాకీ జై నినాదంతో ప్రసంగాన్ని మొదలు పెట్టిన షా.. నిర్మల్ లో కేక పెడితే హైదరాబాద్, మరాఠా వరకు వినిపించాలని నినదించారు.
సెప్టెంబర్ 17.. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజన్నారు అమిత్ షా. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛ లభించిన రోజని.. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన వెంటనే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా జరుపుకుందామని చెప్పారు. ఎంఐఎంకు బీజేపీ భయపడేది లేదన్న ఆయన.. విమోచన దినోత్సవంపై కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. నిర్మల్ లో నిజాం పాలనలో వెయ్యిమందిని ఉరితీశారని.. ఇది గుర్తుకు రావడం లేదా అని కేసీఆర్ ను నిలదీశారు. ఆ అమరుల త్యాగాన్ని వృధా కానివ్వమని.. కచ్చితంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహించి తీరుతామని స్పష్టంచేశారు.
తెలంగాణలో కుటుంబ పాలన తప్ప ఇంకేం కనిపించడం లేదని విమర్శించారు అమిత్ షా. అయ్య, కొడుకు, కూతురు మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. తెలంగాణకు అసలైన స్వాతంత్రం ఎంఐఎంను తరిమికొట్టినప్పుడేనని.. కారు కేసీఆర్ దే కానీ స్టీరింగ్ మాత్రం ఓవైసీ చేతిలో ఉందని సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా మాట ఇస్తున్నానన్న షా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తామేంటో చూపిస్తామని స్పష్టంచేశారు. ఏ ఎన్నికైనా డబ్బుతో గెలవొచ్చని టీఆర్ఎస్ అనుకుంటోందని విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో పక్కాగా గెలుస్తామని.. అన్ని స్థానాలను మోడీ సంచిలో వేస్తామని చెప్పారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది ప్రజల కోసమే ప్రారంభించారని అన్నారు. 119 నియోజకవర్గాల్లో బండి పాదయాత్ర పూర్తి చేస్తారని చెప్పారు. ప్రజల కోసం, ఆదివాసీల కోసం, తెలంగాణ కోసం బండి ముందుకు నడుస్తున్నారని కొనియాడారు. ఈ యాత్ర ఎంఐఎంకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా జరుగుతోందని వివరించారు. ఇక ఉద్యమంలో వెన్నంటి ఉన్న ఈటలను కేసీఆర్ ఎలా పక్కనపెట్టారో మనందరికీ తెలుసన్నారు అమిత్ షా.