- ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలు
- తెలంగాణ కోసం అమిత్ షా సరికొత్త వ్యూహాలు
- హస్తిన బాటలో తెలంగాణ బిజెపి నేతలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? తెలంగాణ రాజకీయ పరిణామాలపై కమలం పార్టీ సమాచారం సేకరిస్తోందా? ముఖ్య నేతల ఢిల్లీ పర్యటనల వెనుక ఆంతర్యమేంటి? ఒకరకి తెలియకుండా మరొకరి నుంచి విడివిడిగా అమిత్ షా మంతనాలు జరపడం వెనుక రహస్య ఎజెండా ఉందా? జాతీయ కార్యవర్గ సమావేశాల ముందు నేతల ఢిల్లీ పర్యటనలు హీట్ పెంచుతున్నాయా? బీజేపీలో జోరందుకున్న చర్చ ఏంటి?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూనే.. బీజేపీ నేతలను బీజేపీ జాతీయ నాయకత్వం వరుసగా ఢిల్లీకి పిలిపిస్తోంది. హస్తిన బాట పడుతున్న బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్య నేతలకు అమిత్ షా నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లు అమిత్ షాను కలసిన వారిలో ఉన్నారు. అయితే బీజేపీ ట్రబుల్ ఘూటర్ అమిత్ షాలో వీరి భేటీ సారాంశం మాత్రం ఎవరకీ అంతుచిక్కటం లేదు. అమిత్ షాతో సమావేశ వివరాలను పంచుకోవటానికి కమలనాథులు సైతం ఇష్టపడటం లేదు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతోనే అమిత్ షా భేటీ వివరాలను బయటకు చెప్పటం లేదనే చర్చ సాగుతుంది. దీంతో వీరి భేటీ వెనుకున్న రహస్య ఎజెండా ఉందని బీజేపీ వర్గాల సమాచారం.
ఇంకోవైపు జులై 2, 3, 4 తేదీల్లో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ప్రధాని మోడీ భారీ బహిరంగ సభకు బీజేపీ సిద్ధం అవుతోంది. దీంతో కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోందన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అమిత్ షా డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ బలాలు, బలహీనతలపై కూడా అమిత్ షా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బిజెపి చీఫ్ సంజయ్ సైతం హుటాహుటిన ఢిల్లీ పర్యటను వెళ్లారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై హైకమాండ్ తో మాట్లాడటానికి వెళ్ళారని బయటకు చెప్తున్నా.. బండి ఢిల్లీ పర్యటనపై సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు జరిగిన రోజు కిషన్‌రెడ్డి, డీకే అరుణలు విడివిడిగా ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. వీరిద్దరూ తెలంగాణలో పరిస్థితులను షాకు వివరించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏంచేయాలనే అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. డీకే అరుణ, కిషన్‌రెడ్డి భేటీ అనంతరం రెండ్రోజులకే మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హస్తినకు వెళ్లారు. మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ, తెలంగాణలో బీజేపీ పరిస్థితులపై కూడా లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా వరుసగా భేటీలను రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తర్వాత దూకుడు మీదున్న బీజేపీ హుజూరాబాద్‌లో గెలుపుతో జోరు పెంచింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా నేతల మధ్య గ్యాప్ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలోని కీలక నేతలను ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న బిజెపి.. అందులో భాగంగానే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే అమిత్ షా మార్క్ రాజకీయం ప్రారంభించారన్న చర్చ నడుస్తోంది. పార్టీలో సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది. మొత్తానికి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మారనున్నాయని కమలనాథులు చెప్తున్నారు.