– 28న తెలంగాణకు అమిత్ షా
– ఆదిలాబాద్ గడ్డపై వ్యూహాత్మక అడుగులు
– తెలంగాణపై పక్కా ప్లాన్ తో ముందుకు!
– జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
– బీఆర్ఎస్ పతనమే లక్ష్యమన్న బండి, కిషన్ రెడ్డి
ఈసారి తెలంగాణలో పక్కాగా గెలిచి తీరుతామని ధీమాగా చెబుతున్నారు కమలనాథులు. దీనికోసం కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ఇచ్చిన బూస్టప్ తో మరింత దూకుడుగా వెళ్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన.. ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు.
గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమలం పార్టీ.. నెలాఖరున షాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు తీసుకొస్తోంది. మంగళవారం ఆదిలాబాద్ లో ఉమ్మడి జిల్లా బీజేపీ సమావేశం జరిగింది. షా పర్యటనపైనే ముఖ్యంగా చర్చించారు నేతలు. 28న షా పర్యటన ఖరారు అయిందని తెలిపారు. కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్ కు వెళ్లి అక్కడ నివాళి అర్పిస్తారు షా.
ఉట్నూర్ లేదా ఆదిలాబాద్ లేదా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. మోడీ స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రామరాజ్యం స్థాపన చేస్తామన్నారు సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో మోడీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని, యాత్రకు సంధించిన ఫీడ్ బ్యాక్ ఆయన వద్ద ఉందని తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాయకత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్తామన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోడీ తమను ఆదేశించారని చెప్పారు. రాష్ర్టాన్ని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి.. దేశాన్ని కూడా దోచుకునేందుకు బీఆర్ఎస్ పెట్టారని ఆరోపించారు. ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా కల్వకుంట్ల కుటుంబం ఫాంహౌస్ కు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు కిషన్ రెడ్డి.