ఎంఫాన్ తుపాను ముంచుకొస్తోంది . ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. తుపానుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రాలు చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు సీఎంలు అమిత్ షా కు పలు సూచనలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా కేంద్ర హోం మంత్రి షాతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఎన్‌డీఆర్ఎఫ్‌కు చెందిన 25 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. మరో 12 బృందాలను రిజర్వ్‌లో ఉంచారు. పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా మారిన ఆంఫన్ తీరం వైపు దూసుకొస్తోంది . ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలోని హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరాన్ని బలంగా తాకుతున్నాయి. అలల తాకిడికి సముద్ర తీర ప్రాంతాల్లో గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల సముద్రం ముందుదాకా దూసుకొచ్చింది. ఆంఫన్ పెను తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో అలజడి నెలకొంది. చాలా చోట్ల వానలు కురుస్తున్నాయి.