అసోం రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. అమిత్ షా నిన్న గువాహటిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ రోజు ఆయన నిలాచల్ కొండల్లోని కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
దర్శనానికి వచ్చిన అమిత్ షాకు ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలను చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఆయన పర్యటిస్తున్నారు.
సైన్యానికి ప్రత్యేక అధికారాలు కల్పించే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్ పీఏ)పై ఆయన స్పష్టత ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాతే చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్‌ను ప్రధాని మోడీ హయాంలో మూడింతలు పెంచామన్నారు. మోడీ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరుగుతోందని ప్రజలందరూ గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో గత పాలకులు అరాచకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.