మూడు రోజుల పర్యటనకు గాను హోం మంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన కాత్రా లోని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకొని ప్రార్థనలు చేశారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉన్నారు.. ఆయన రాక సందర్భంగా జాతి వ్యతిరేకశక్తులు శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చునన్న అనుమానంతో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో తాత్కాలికంగా మొబైల్ డేటా సర్వీసులను రద్దు చేశారు.
రాజౌరీ జిల్లాలో అమిత్ షా భారీ ర్యాలీలో పాల్గొననున్నారు, ఈ ర్యాలీలో ఆయన పహారీ కులస్తులను ఎస్టీలుగా గుర్తిస్తామని ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఎస్టీ హోదా అనుభవిస్తున్న గుజ్జర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పహారీలను ఎస్టీలుగా పరిగణించిన పక్షంలో తాము ఉద్యోగావకాశాలు, ఇతర ప్రయోజనాలు కోల్పోతామని వారు భయపడుతున్నారు. అందువల్ల షా పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకువారు ఈ జిల్లా చేరుకుంటున్నారు..
రాజౌరీ, పూంఛ్ జమ్మూ జిల్లాల్లో గత వారం రోజులుగా గుజ్జర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఇక ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగే ర్యాలీలో అమిత్ షా పాల్గొంటారు.
తమకు ఎస్టీ హోదా కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని పహారీ కల్చరల్, వెల్ ఫేర్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. తమకీ హక్కు ఉందని, ఇది నెరవేరే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. పహారీలను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండును 2002 లో అప్పటి ఏ.బీ. వాజ్ పేయి ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే ప్రస్తుత మోడీ ప్రభుత్వం వీరి డిమాండును తీర్చే దిశగా నిర్ణయం తీసుకుంటోంది.