
ఐపీఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ముఖ్య అతిథిగా హోంమంత్రి
హైదరాబాదు : పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ మంచి పలితాలు సాధించాలని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా యువతరం పోలీస్ అధికారులకు సూచించారు. మోదీ ‘స్మార్ట్ పోలీస్’ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కొత్త ఐపీఎస్ అధికారులకు హోం మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఉన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఐదేళ్లు అధికారంలో ఉంటారని, అదే పోలీసులు ముప్పయ్యేళ్ల పాటు సర్వీసులో ఉంటారని అమిత్ షా అన్నారు. ఐపీఎస్ అధికారులు నిజాయితీతో పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు సేవచేసి, వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. పేద ప్రజల తరపున నిలిచి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. ఎక్కడైనా కానీ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని సూచించారు. పేదరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఈ వేడుకలో హోం మంత్రి కవాతును పరిశీలించి, ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రొబెషనర్లకు బహుమతి ప్రదానం చేశారు, మొత్తం 103 మంది అధికారులలో 15 మంది మహిళా అధికారులు, ఆరుగురు రాయల్ భూటాన్ పోలీసులు, ఐదుగురు నేపాల్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉన్నారు. ప్రొబెషనరీ అధికారులందరినీ అమిత్ షా అభినందించారు.