కౌన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ అప్రతిహతంగా కొనసాగుతోంది. కరోనా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తల నడుమ షోను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ ఈ షోలోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పట్ల ఆయన ఆప్యాయతను ప్రదర్శిస్తారు. ఆ షోను ఒక కార్యక్రమంలా కాక.. మధ్య మధ్యలో కంటెస్టెంట్లకు చెందిన జీవిత విశేషాలను ఆయన అడిగి తెలుసుకుంటూ.. రియల్ షోలా దాన్ని మార్చారు.
అయితే డిసెంబర్ 1వ తేదీన జరిగిన ఓ కేబీసీ 12 ఎపిసోడ్‌లో అమితాబ్ ఓ కంటెస్టెంట్‌ను పేరు పెట్టి పిలవలేదు. అవును.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అభిలాషా రావు కల్వ ఆ ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో అమితాబ్ ఎదురుగా కూర్చుంది. అయితే ఆమెను ఆయన ఆమె పేరుతో కాకుండా రేంజర్ సర్ మేడమ్ అని పిలిచారు. ఎపిసోడ్ మొత్తం ఆమె వెళ్లే వరకు ఆమెను ఆయన అదే పేరిట పిలిచారు.
అభిలాషా రావు తాను అటవీ శాఖ అధికారిణిగా పనిచేసేటప్పుడు తాను ఎదుర్కొనే సవాళ్లను బిగ్ బి కి వివరించింది. సాధారణంగా ఆ పోస్టుల్లో పురుషులే ఎక్కువగా పనిచేస్తుంటారు. కానీ ఆమె స్త్రీ. అందులోనూ వన్య ప్రాణులు ఉండే అడవి కనుక ఆమె మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక అడవుల్లో తిరిగే నేరస్థులు, స్మగ్లర్లు సరే సరి. దీంతో ఆమె అనుక్షణం జాగ్రత్తగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఆమె బిగ్‌బి కి తెలిపింది.
అయితే సాధారణంగా ఫారెస్ట్ ఆఫీసర్ అంటే పురుషులే ఆ డ్యూటీలో ఉంటారు కనుక ఆమెకు పనిమీద ఫోన్ చేసే వారు అలవాటు ప్రకారం సర్ అని కాల్ మాట్లాడేటప్పుడు ముందుగా అనేవారు. కానీ అవతల ఉన్నది లేడీ ఆఫీసర్ అని వారు గ్రహించి వెంటనే వారు సర్ అన్నాక మేడమ్ అనేవారు. ఈ క్రమంలో వారు ఆమెను సర్ మేడమ్ అని పిలవాల్సి వచ్చేది. అదే విషయాన్ని ఆమె బిగ్‌బికి తెలపగా ఆయన ఆమెను కూడా సరిగ్గా అలాగే పిలిచారు. రేంజర్ సర్ మేడమ్ అని ఆమెను సంబోంధించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బయింది. ఇక ఆమె తాను పనిలో ఉన్నప్పుడు అడవిలో తీసుకున్న కొన్ని ఫొటోలను కూడా అమితాబ్‌కు చూపించి తన ఆనందాన్ని ఆయనతో కలిసి పంచుకుంది.