బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే.. షూటింగ్ సమయంలో అమితాబ్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ అస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో బచ్చన్ కు పక్కటెముకల వద్ద తీవ్రగాయాలయినట్లు సమాచారం. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. 2 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఏఐజీలో చికిత్స అనంతరం అమితాబ్ ముంబై వెళ్లినట్లు తెలిసింది.
గత అక్టోబర్ లో కూడా షూటింగ్ సమయంలో గాయపడ్డారు అమితాబ్. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో చేస్తున్న సమయంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి నరం కట్ అయిందని ఆయనే స్వయంగా చెప్పారు. రక్త స్రావాన్ని ఆపడానికి కొన్ని కుట్లు కూడా వేశారని తెలిపారు.
ఆ గాయం నుంచి కోలుకున్నాక పలు సినిమాలకు కమిట్ అయ్యారు అమితాబ్. ప్రాజెక్ట్ కే చిత్రాన్ని ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపికా పదుకోణ్ నటిస్తోంది.
మరోవైపు అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం అని వచ్చిన వార్తల్లో నిజం లేదని నిర్మాత అశ్వినీదత్ అంటున్నారు. మూడు రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకొని ఆయన ముంబై వెళ్ళారన్నారు. తమ షూటింగ్ లో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.