అమ్నేషియా పబ్ అత్యాచార ఘటన చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. అధికారపార్టీ నేతలు ఈ విషయంలో సైలెంట్ గా ఉండగా.. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు చేసిన క్రూరమైన చర్యను తప్పుబడుతూ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. అయితే.. ఈ అత్యాచార ఘటనలో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది.
ఇప్పటిదాకా ఐదుగుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో ఏ1గా ఎంఐఎం నేత కుమారుడు సాదుద్దీన్, ఏ2గా ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్ ఖాన్ ఉన్నారు. మిగిలిన ముగ్గురు మైనర్లు. వారిలో ఒకరు వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, ఇంకొకరు ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు, మరొకరు సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కుమారుడు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వీరంతా ఇన్నోవా కారులో మొయినాబాద్ కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్ లో ఆశ్రయం పొందారు. దాని వెనకాలే ఇన్నోవా కారుని దాచారు. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్ ను సైతం అక్కడే తొలగించినట్లు సమాచారం. ఫాంహౌస్ లో సేద తీరిన తర్వాత.. అక్కడి నుంచి నిందితులు వేర్వేరు చోట్లకు పరారయ్యారు.
రాజకీయ నేతల కుమారులు కావడంతో వీళ్లు మామూలు ఐడియాలు వేయలేదు. పోలీసుల్ని గందరగోళానికి గురి చేసేందుకు సిమ్ కార్డుల్ని ఇద్దరి ఫోన్లలో వేసి వాళ్లను గోవా పంపించారు. వీరు మాత్రం కర్ణాటకకు వెళ్లారు. పోలీసులు ఎట్టకేలకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే.. ఇందులో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర కూడా ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే రఘునందన్ ఫోటోలు, వీడియోను కూడా విడుదల చేశారు.