హైదరాబాద్ ఎన్ కౌంటర్ ను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పుబట్టింది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రేప్ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్టుగా వస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, వేగవంతంగా దర్యాప్తు జరిగేలా చూడాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది. చట్ట పరిధిని దాటి నిందితులను చంపడం వల్ల రేప్ లు ఆగవని సంస్థ ఇంటర్నేషనల్-ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ అన్నారు. ”దిశ” కేసులో వెంటనే ఎఫ్.ఐ.ఆర్ చేయడంలో పోలీసుల అలసత్వం, తూ తూ మంత్రంగా రేప్ కేసుల దర్యాప్తు జరగడం, రేప్ కేసుల్లో నిందితులకు తక్కువ శిక్షలు పడడం చూస్తుంటే భారతదేశంలో న్యాయం ఇంత దారుణంగా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
రేప్ కేసు విచారణలో భాగంగా రీకన్ స్ట్రక్షన్ ఆఫ్ సీన్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పడు వారు పోలీసుల తుపాకులు లాక్కొని పోలీసుల పైకే దాడి చేశారని…పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు మరణించినట్టుగా చెప్పారని అమ్నెస్టీ పేర్కొంది.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, నేరం జరిగిన వెంటనే నిందితులను చంపడం, నిందితులు పారిపోయేలా చేయడం వంటివి నిషేధం. సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ మీద జరిగిన అంతర్జాతీయ సమవేశంలో ఇండియా పాల్గొన్నట్టు గుర్తు చేసింది.
హక్కులను గౌరవించే ఈ ఆధునిక సమాజంలో రేప్ కేసు బాధితులకు న్యాయం చేయడం కోసం చట్టాన్ని చేత్తులోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమే కాదు…భారత న్యాయ వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిది. కాబట్టి ఎన్ కౌంటర్ పై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అవినాష్ కుమార్ అన్నారు.