సూపర్ సైక్లోన్ అంఫాన్ మద్యాహ్నం బెంగాల్ తీరాన్ని తాకనుంది. అంఫాన్ కాస్త బలహీన పడ్డప్పటికీ గంటలకు 180కి.మీ వేగంతో గాలులతో బెంగాల్ లోని దిఘా, బంగ్లాదేశ్ లోని హాతియా మధ్య తీరాన్నితాకే అవకాశం ఉంది. తీరంను తాకే సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ ఈదురు గాలులతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ దాటికి ప్రభావితం అయ్యే 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ మొదలైంది. ఎన్టీఆర్ఎఫ్, భారత నేవీ బృందాలు ఇప్పటికే శ్రమిస్తున్నాయి. బంగాళఖాతంలో ఇలాంటి సూపర్ సైక్లోన్లు అరుదుగా వస్తాయని అధికారులంటున్నారు.
ఉదయం నుండి బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. బెంగాల్ లోని 7 జిల్లాలు నేరుగా తుఫాన్ ప్రభావితం కానున్నాయి. కోల్ కత్తాలోనూ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
తుఫాన్ కు తీవ్రంగా ప్రభావితం కానున్న జిల్లాలను రెడ్ ప్లస్ జోన్స్ గా ప్రకటించిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీ… ఈ రాత్రంతా కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు.
తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని… ప్రభుత్వం చెప్పే వరకు బయటకు రావద్దంటూ బెంగాల్ సీఎం ప్రకటన జారీ చేశారు. గతేడాది వచ్చిన ఫణి తుఫాన్ కన్నా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ పై ముందు జాగ్రత్త చర్యలుగా బెంగాల్ లో 3లక్షల మందిని, ఒడిశాలో లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు.
ఓవైపు కరోనాతో పారాడుతున్న సమయంలో తుఫాన్ రావటంతో ఛాలెంజింగ్ గా పనిచేస్తున్నామన్నారు ఎన్టీఆర్ఎఫ్ చీఫ్.