అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ నేడు లోక్ సభ పార్లమెంట్ ప్రివిలెజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, జైలులో తన పట్ల సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారని కమిటీ ముందు ఆమె తన వాదనలు వినిపించనున్నారు.
అంతకు ముందు ఈ విషయమై ఆమె ప్రివిలెజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. లోక్ సభ ఎంపీలకు ఆ సభ స్పీకర్ సంరక్షునిగా ఉన్నారని, అందుకే తనకు జరిగిన అన్యాయం గురించి ఆయకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆమె వెల్లడించారు.
ఈ విషయంలో తన వాదనలను ఈ నెల 23న విననున్నట్టు ప్రివిలెజ్ కమిటీ తెలిపిందని ఆమె చెప్పారు. తనకు జరిగిన అన్యాయాన్ని కమిటీ ముందు వివరిస్తానని, దీనిపై కమిటీకి లిఖితపూర్వకంగానూ తెలియజేస్తానని ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతానని నవనీత్ కౌర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గత నెల 23న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు ఈ నెల 5న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.