అది పంజాబ్ అమృత్సర్ ఎయిర్ పోర్ట్ . సింగపూర్ వెళ్ళాల్సిన విమానం కోసం ప్రయాణికులు రాత్రి 7.55 గంటలు షెడ్యూల్ టైమ్ కి వచ్చి వెయిట్ చేస్తున్నారు. దాదాపు 35 మంది ప్రయాణికులు సింగపూర్ విమానం అనౌన్స్ మెంట్ వస్తుందని చెవులు రిక్కించి మరీ వింటున్నారు.
ఎంతకీ రాకపోయే సరికి ఎక్వైరీ సిబ్బందిని అడిగారు. వాళ్ళు చెప్పిన సమాధానం విని పాసింజర్స్ కళ్ళు బైర్లు కమ్మాయి. అదేంటయ్యా అంటే, మద్యాహ్నం 3 గంటలకే సదరు విమానం సింగపూర్ చెక్కేసిందట..! మరా విషయం మాకు చెప్పాలి కదా అని నిలదీశారు విసిగిపోయిన ప్రయాణికులు.
విమానం టైమింగ్స్ మారడాన్ని మీకు మెయిల్ చేసాం చూసుకోవాల కదా అని ఎదరు ప్రశ్నవేసారు సిబ్బంది. 35 ప్రయాణికులూ ఖంగు తిన్నారు. దిక్కుతోచక అక్కడే కూర్చుండి పోయారు. వివరాల్లోకి వెళ్తే …
సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ (Scoot Airline) విమానం 35 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయింది. నిర్ణీత సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు అమృత్‌సర్ నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉన్నది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే అమృత్‌సర్ నుంచి వెళ్లిపోయింది.
దీంతో సింగపూర్‌కు టికెట్లు బుక్‌చేసుకున్న ప్రయాణికులు అవ్వాక్కవ్వాల్సి వచ్చింది. కాగా, విమాన సమయంలో జరిగిన మార్పుల గురించి ప్రయాణికులకు తాము ముందుగానే తెలియజేశామన్నారు.
ప్యాసింజర్లకు ఈ-మెయిల్ చేశామని అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకున్నది. ఢిల్లీకి వెళ్తున్న గో ఫస్ట్ ఫ్లైట్ విమానం 50 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలి వెళ్లడం గమనార్హం.