ఆఫ్ఘనిస్తాన్ ను కమ్మేశారు తాలిబన్లు. ఎక్కడ చూసినా వారే. ప్రజలు భయంతో వణికిపోతుంటే.. వాళ్లు మాత్రం దేశం తమ వశం అయిందన్న సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే తాలిబన్లను గుర్తించే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్. అంతేకాదు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
దేశాధ్యక్షుడు పారిపోవడంతో ప్రస్తుతానికి తానే తాత్కాలిక అధ్యక్షుడినని అంటున్నారు సలేహ్. ఈ సందర్భంగా అక్కడి రాజ్యాంగ నిబంధనలను గుర్తు చేస్తున్నారు. అమెరికా, నాటోలా తాము స్ఫూర్తిని కోల్పోలేదని చెబుతూనే పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ ఒక్కటి చేస్తున్నారు. తాను ఎప్పటికీ ఉగ్రవాదులకు తలవంచను అని చెబుతున్నారాయన.
ఇప్పటికే పంజ్ షీర్ లోయలో దివంగత తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ తో సలేహ్ సంప్రదింపులు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకొచ్చింది. పంజ్ షీర్ వ్యాలీ తాలిబాన్ల చేతిలో లేని ఏకైక ప్రాంతంగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచే తాలిబన్ల వ్యతిరేక కూటమి ఏర్పాటు అవుతుందని భావిస్తున్నారు. మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
భారత్ సహా ఇరాన్, రష్యా వంటి దేశాలతో ఉత్తర కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించారు అహ్మద్ షా మసౌద్. ఇప్పుడు ఆయన కుమారుడు కీలకంగా ఉన్నారు. సలేహ్ కూడా పంజ్ షీర్ కి చెందిన నేతే. అహ్మద్ షా మసూద్ ఆధ్వర్యంలో పోరాడారు. 1990ల చివరలో ఉత్తర కూటమిలో సభ్యుడయ్యారు. తాలిబాన్ విస్తరణకు వ్యతిరేకంగా పోరాడారు. భారత నిఘా సంస్థల నుండి శిక్షణ కూడా పొందారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వ గూఢచారిగా, అంతర్గత మంత్రిగా, దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
తాలిబాన్లు సలేహ్ ను హతమార్చడం కోసం అనేక ప్రయత్నాలు చేశాయి. అయితే మళ్లీ ఇన్నాళ్లకు తాలిబన్లు రెచ్చిపోతుండడంతో వారికి వ్యతిరేకంగా ఆయన.. అహ్మద్ మసౌద్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ తో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నారు.