ముంబైకి చెందిన ఓ లేడీ డిజైనర్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిక్ షా అనే మహిళ తనను బెదిరిస్తోందని, బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె తండ్రి ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడని అమృత ఫడ్నవీస్ అన్నారు.
తన తండ్రికి సంబంధించిన కేసులో జోక్యం చేసుకోవాలంటూ తనకు రూ. కోటి ఇవ్వజూపిందన్నారు. ఈ మేరకు గత నెల 20న ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. అనిక్ షా తనను తొలిసారి 2021 నవంబర్‌లో కలిశారాని చెప్పారు.
ఆ తర్వాత ఫిబ్రవరి 18,19 తేదీల్లో గుర్తు తెలియని నంబర్ నుంచి అనిక్ షా తనకు వీడియో క్లిప్‌లు, వాయిస్ నోట్స్, మెసేజ్‌లను పంపించిందన్నారు. అనిక్ షా దుస్తులు, ఫుట్ వేర్, జ్యుయేలరీ డిజైన్ చేస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు, జ్యువెలరీ పబ్లిక్ ఈవెంట్స్ కోసం ధరించాలని అనిక్ షా తనను కోరిందన్నారు.
ప్రమోషన్ కోసం అలా చేయాలని తనను ఆమె కోరిందన్నారు. ఆ తర్వాత పలు మార్లు ఆమె డిజైన్ చేసిన దుస్తులను తన సిబ్బందికి ఇచ్చి వాటిని తనకు చేరేలా చేయాలని అనిక్ షా వారిని కోరిందన్నారు. అలా పలు మార్లు చేసిందన్నారు. వాటిని ఏదైనా పబ్లిక్ ఈవెంట్ లో ధరించానో లేదో తనకు గుర్తు లేదన్నారు. ఆ తర్వాత వాటిని ఆమెకు ఇచ్చి వేయాలని తన సిబ్బందికి చెప్పానన్నారు.
ఆ తర్వాత ఓ రోజు ఆమె తనకు లేఖ పంపిందని, ఆమె చేతిరాత తనకు అర్థం కాలేదన్నారు. ఈ క్రమంలో ఓ సారి తన భద్రతా సిబ్బందిని ఏమార్చి తన కారులో ఆమె కూర్చుందన్నారు. ఆ సమయంలో తన తండ్రి బుకీల గురించి పోలీసులకు సమాచారం ఇస్తాడని, డబ్బులు ఎలా సంపాదించ వచ్చో ఆమె చెప్పిందన్నారు. దీంతో వెంటనే ఆమెను కారు నుంచి దించేశాను అని చెప్పారు.
ఆ తర్వాత ఓ రోజు ఫోన్ చేసి తన తండ్రిపై నమోదైన కేసు గురించి వివరించిందన్నారు. తన తండ్రి కేసులో సహాయం చేస్తే రూ. కోటీ ఇస్తానని అనిక్ షా చెప్పిందన్నారు. దీంతో తాను ఫోన్ కట్ చేశానన్నారు. ఈ మేరకు ఆమెపై అమృత ఫడ్నవీస్ ఫిర్యాదు చేశారు.