జమున.. గడుసుతనానికి ఆమె పెట్టింది పేరు. సౌందర్యానికి అసలు సిసలు చిరునామా. సినిమా ఏదైనా పాత్రే కనబడుతుంది.. కానీ, నటి కనబడదు. ముఖ్యంగా వెండితెరపై సత్యభామ పేరు వినపడగానే ఆమె రూపమే గుర్తొస్తుంది. వెండితెరపై విభిన్న పాత్రలను అవలీలగా పోషించి… తెలుగు ప్రేక్షక హృదయాల్లో విశిష్ట స్థానం పొందిన నటి జమున. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. ఆమె వయసు 86 యేళ్లు. ఇక ఈమె సినీ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్.
జమున వెండితెర మీద పరుచుకున్న నిండు పున్నమి వెన్నెల. ఆమె హావభావ విన్యాస ప్రదర్శన ముందు ఎన్నో పాత్రలు సవినయంగా తల వంచాయి. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించిన జమున…. 1936 ఆగష్టు 30న కర్ణాటకలో హంపిలో జన్మించారు. తండ్రి నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్య దేవి. చిన్నపుడే తల్లి దగ్గర హార్మోనియం, సంగీతంతో పాటు డాన్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆమె అసలు పేరు జానా భాయి. జ్యోతిష్య పండితుల సూచన మేరకు జమున గా పేరు మార్చారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల బాలికల పాఠశాల చదివింది. ఆ రోజుల్లోనే జమునకు ఎన్నో నాటకాల్లో నటించిన అనుభవం ఉంది. అలా జగ్గయ్యకు చెందిన ‘ఖిల్జీరాజు పతనం’తో నాటకాల్లో ప్రవేశించింది. అలా నాటకాల్లో నటిస్తూనే సినిమా రంగంపై ఆసక్తి పెంచుకుంది. నటిగా జమున ఫస్ట్ మూవీ పుట్టిల్లు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా.. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. జమునకు మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ ‘అంతా మనవాళ్లే’. తాపీ చాణక్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో జమున వెనుదిరిగి చూసుకోలేదు. జమున అసమాన నటనా ప్రతిభే …ఆమెకు అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ సరసన అవకాశాలు కల్పించాయి.
సత్యభామ దర్పానికి, రాణీ మాలీని దేవి అహంకార ప్రదర్శనకు, అన్నపూర్ణ సహనానికీ, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానకి హుందాతనానికీ, గౌరమ్మ చిలిపితనానికీ, చిరునామా. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి ప్రేమకు ప్రతీకగా నిలిచే జమున అభినయం నేటి తరం కథానాయికలకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం నటిగా జమున ప్రత్యేకత. వెండితెరపై జమున అందం.. ఒక వెన్నల వర్షం. ఎన్నటికీ వాడిపోని పారిజాత పుష్పం.. మిస్సమ్మలో జమున పాత్ర చలాకీగా ఉంటూ సావిత్రిని ఉడికిస్తూ సాగుతుంది. అసలు జమున అందమంతా ఆమె నడక, మాటతీరు, కళ్లలోనే ఉంటుంది. బృందావనమిది అందరిది.. పాట జమున నట జీవితంలో నేటికి నిలిచే ఉంది అందుకే.
జమున క్రమశిక్షణ, నియమబద్ధ జీవనవిధానం.. ఆదర్శప్రాయం. సూర్య చంద్రులకు గ్రహణాలు తప్పవన్నట్లు కెరీర్ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్, ఎఎన్ఆర్లతో విభేధాలు.. జమునకు వారి సరసన అవకాశాలు దూరం చేశాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత చక్రపాణి జోక్యంతో ఈ విభేదాలకు తెరపడింది. ముఖ్యంగా ‘గుండమ్మకథ’ లో గడసరి పాత్రలో జమున నటన నేటికి మరిచిపోలేము. గుండమ్మ కథ విజయానికి జమున పాత్ర కూడా దోహదం చేసిందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమా నుంచి జమునకు మళ్లీ మహర్దశ ప్రారంభమైంది.
కళ్లను పక్కకు తిప్పుకోలేని అందం జమున సొంతం. ఆ రోజుల్లో హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. ఆమె కాల్షీట్లు దొరికిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టేవారు. కళ్లతోనే విలనిజాన్ని కురిపించగలదు. పండంటి కాపురంలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ను అద్బుతంగా పోషించి మెప్పించింది. ఇక పౌరాణిక చిత్రాల్లో.. కృష్ణుడి పాత్రంటే, ప్రేక్షకులకు ఎన్టీఆరే ఎలా గుర్తుకువస్తాడో.. సత్యభామ పాత్రలో జమున అలా గుర్తుకువస్తుంది. అంతకు ముందు సత్యభామ పాత్రలో ఎస్.వరలక్ష్మీ, సావిత్రి వంటి నటీమణులు నటించినా.. సత్యభామగా.. జమునకు వచ్చినంత నేమ్ అండ్ ఫేమ్ ఎవరికీ రాలేదు. తెలుగుతెరపై సత్యభామ అంటే జమునే అన్న చందంగా..తనదైన నట విన్యాసంతో, జాణతనంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
సినీ రంగంలో ఉంటూనే సేవ, రాజకీయ రంగాల్లోనూ జమున విశేషంగా కృషి చేసింది. ఏటా తన పుట్టినరోజున పేద కళాకారులకు ఆర్థిక సాయం చేస్తుంది. 1980లో ఇందిరా గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1989లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు.ఆ తర్వాత 1991 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆపై రాజకీయాలకు గుడ్ డై చెప్పేసారు. నేటికి రంగస్థల కళాకారుల కోసం సేవలందిస్తూనే ఉంది జమున. పాతతరంలో హీరోయిన్లలో సావిత్రి తర్వాత స్థానం జమునదే.
తెలుగులో 145 చిత్రాల్లో నటించిన ఈమె తమిళంలో 20, కన్నడలో 7, హిందీలో ‘మిలన్’, మిస్ మేరి వంటి 10కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,హరనాథ్, జగ్గయ్య వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
1965 ఆచార్య రమణారావుతో ఈమె వివాహాం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తొలి తరం నటి ఈమెనే కావడం విశేషం. అప్పట్లో చైన్నైలో తన ఆస్తులను ఎంతో తక్కువగా అమ్మేయడం పెద్ద చర్చనీయాంశం అయింది. జమున కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే.. ‘గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇల్లరికం, శ్రీ కృష్ణతులాభారం, మూగనోము, లేత మనసులు, మూగ మనసులు, నిరు పేదలు, మా గోపి, తెనాలి రామకృష్ణ,మంగమ్మ శపథం, ఇలవేల్పు, సంసారం, రాము, దొంగరాముడు, అప్పచేసి పప్పుకూడు, భూ కైలాస్, గులేబకావళి కథ, ఉండమ్మ బొట్టు పెడతా, మనుషులంతా ఒక్కటే, సంపూర్ణ రామాయణం, పండంటి కాపురం, చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇక ఎన్టీఆర్‌తో చేసిన ‘మంగమ్మ శపథం, రాము,రాముడు భీముడు,శ్రీ కృష్ణ తులభారం, బొబ్బిలి యుద్దం, చంద్రహారం, చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి.అక్కినేనితో చేసిన మూగ మనసులు, మూగనోము, ఇల్లరికం, మిస్సమ్మ, గుండమ్మ కథ,పూల రంగడు వంటి చిత్రాలు వీరి జోడికి మంచి పేరు తీసుకొచ్చాయి.
పెళ్లి తర్వాత అందరి సినీ జీవితం కంచికి చేరుతుంది. కానీ జమున మాత్రం పెళ్లైన తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేసింది. 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకుంది. ఇలా సినీ, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జమున పార్ధివ దేహాన్ని ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. ఆమె మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖుులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.