నూతన సెక్రటేరియట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఈ ప్రమాదం పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసి మారేడు కాయ చేయడం తప్పన్నారు. కేసీఆర్ పుట్టిన రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు ఆయన.
కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడానికి ఇదేమైన రాచరికమా అని ప్రశ్నించారు. అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలని రేవంత్ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఈ రోజు తెల్లవారుజామునే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో గుమ్మటంపై భారీగా పొగలు వ్యాపించాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సచివాలయంలో వుడ్ వర్క్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మంటలు వచ్చినట్టు సమాచారం.
అయితే నూతన సచివాలయంలో ఎలాంటి నష్టం సంభవించలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు.