అమెరికాలో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత పొందుతున్న ఆట క్రికెట్. క్రికెట్ పనికూన అనటం కూడా పెద్దమాటే. కానీ అమెరికా తరుపున ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అలీఖాన్ ఇప్పుడు ఐపీఎల్ ఆడబోతున్నాడు. కోల్ కతా తరుపున ఈ ఐపీఎల్ లో మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్ గా అలీకి మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో… తమ గెలుపులో ఈసారి అలీఖాన్ కీలకం అవుతాడని ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ధీమాగా ఉన్నాడని ప్రచారం సాగుతుంది.
నిజానికి గత ఐపీఎల్ సీజన్ లోనే అలీఖాన్ షారుఖ్ కంటపడ్డాడట. కానీ కుదరకపోవటంతో… ఈసారి ఎలాగైనా ఆడించాలన్న తన ఆసక్తి నెరవేరబోతుంది. కేకేఆర్ ఆటగాడు హారీ గర్నీ భుజం గాయం కారణంగా టోర్నీ నుండి వైదొలగటంతో ఆ స్థానంలో అలీఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
29ఏళ్ల ఈ కుర్రాడు… తొలిసారిగా టీ20 నెనడా లీగ్ లో మెరిసాడు. అప్పుడు వెస్టిండీస్ ఆటగాడు బ్రేవో కంటపడటంతో… గయానా అమెజాన్ తరుపున సీసీఎల్ ఆడేందుకు తీసుకొచ్చాడు. ఆ టోర్నీలో మొత్తం 12మ్యాచులు ఆడి, 16వికెట్లు సాధించాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడు అలీఖాన్. ఐపీఎల్ కోసం తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకోవటంతో… ఈ సారి కేకేఆర్ తరుపున ఆడటం లాంఛనమే కానుంది.