ఇండియా వర్ధమాన దేశమా? లేక ‘సుసంపన్న దేశమా’? దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీనే తీసుకుంటే.. రెండోదే సరైనదనిపిస్తుంది. ప్రభుత్వాలు మారిపోతే తమ అదృష్టాలు కూడా మారిపోతాయనడానికి అదానీయే నిదర్శనం. ప్రపంచంలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తరువాత గౌతమ్ అదానీ మూడో అతి పెద్ద బిలియనీర్ అని ఫోర్బ్స్ ఏ నాడో చెప్పింది. రోజుకు 1600 కోట్లకు పైగా ఆదాయంతో అదానీ తనకు తానే అతిపెద్ద వాణిజ్యవేత్తగా నిరూపించుకున్నారు. ఈయన బిజినెస్ లో మొదట్లో ఆటుపోట్లు ఉండవచ్చుగాక.. కానీ 2014 లో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈయన ఫేట్ ఆకాశమే హద్దుగా అన్నట్టు ఎదిగిపోయింది. బిజినెస్ కి ..అధికారంలో ఉన్న పార్టీ కూడా తోడైతే జరిగే పరిణామాలు ప్రజలకు తెలిసివచ్చాయి. మోడీ ప్రభుత్వ వరాలు ఈ పారిశ్రామికవేత్తను సమున్నత స్థానంలో నిలబెట్టాయి.
ఓ విశ్లేషకుడు అదానీ వాణిజ్య, పారిశ్రామిక ఆటుపోట్లను, ఆ తరువాత అద్వితీయంగా పెరిగిపోయిన ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విశ్లేషించాడు. సొంత పార్టీ (బీజేపీ) నేత సుబ్రహ్మణ్యస్వామి లోగడ.. అదానీకి మోడీ ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలపై ట్వీట్ చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేశాడు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పక్కనబెట్టి ఈ పారిశ్రామికవేత్తకు మొత్తం దేశంలోని పరిశ్రమలనన్నీ కట్టబెట్టిన వైనం రష్యా తరహా వాణిజ్య విధానాన్ని గుర్తుకు తెస్తోందని స్వామి చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించాడు. ఇది ‘ఆలిగార్కీ ‘ విధానం కాక మరేమిటని స్వామి పేర్కొన్న సంగతిని గుర్తుకు తెచ్చాడు.
ఇదే సందర్భంలో గౌతమ్ అదానీ తన యుక్తవయస్సు నుంచే పారిశ్రామిక రంగంలో ఎలా కాలు మోపారో ఆయన వివరించాడు. అదానీ తన 20 ఏళ్ళ వయస్సులో 1978 లో అహ్మదాబాద్ వదిలి ముంబై చేరుకున్నారు. అప్పటికే చిన్నపాటి బిలియనీర్ అయ్యారు. డైమండ్ బిజినెస్ ప్రారంభించారు. మహేంద్ర బ్రదర్స్ కి డైమండ్ సార్దర్ గా పని చేసిన ఆయన ఆ తరువాత తన సొంత డైమండ్ బ్రోకరేజీ సంస్థను ఏర్పాటు చేశాడు. అహ్మదాబాద్ లో తన అన్న మాన్ సుఖ్ భాయ్ స్థాపించిన ప్లాస్టిక్ పరిశ్రమకు 1981 లో నష్టాలు రావడంతో.. ఆయన విజ్ఞప్తిపై సాయం చేశాడు. 1985 లో తానే చిన్న పరిశ్రమల కోసం ప్రైమరీ పాలిమర్స్ ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. 1988 లో అదానీ ఎక్స్ పోర్ట్స్ లాంచ్ అయింది. 1990 ప్రాంతంలో ప్రభుత్వ ఆర్ధిక సరళీకృత విధానాలు ఆయనకు మరింత కలిసి వచ్చాయి.
1996 లో అదానీ గ్రూప్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను చేబట్టింది. దేశంలోనే అతి పెద్ద థర్మల్ పవర్ ప్రొడ్యూసర్ అయింది. 2006 లో ఈ గ్రూపు ఆస్ట్రేలియాలో అబోట్ పాయింట్ పోర్టును ఏర్పాటు చేసింది. 2020 లో సోలార్ ఎనర్జీ రంగంలో ఈ గ్రూప్ ప్రవేశించింది. ఇక ఇండియాలో ఎయిర్ పోర్టులు, పోర్టులు, రోడ్ల నిర్మాణం, మెట్రో రైల్, డేటా సెంటర్ వంటి అనేక రంగాల్లో అదానీ గ్రూప్ ప్రవేశించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవలే మీడియా రంగంలోనూ ఎంటరైంది. ఎన్డీటీవీ మీడియా సంస్థను చేజిక్కించుకునేందుకు పావులు కదిపింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇదే సమయంలో సాదాసీదా చిన్నపాటి పరిశ్రమల వంటి రంగాలు కూడా దేశంలో అభివృద్ధి చెందాల్సి ఉందని, అన్నీ కలిస్తేనే దేశం సుసంపన్నమవుతుందని ఆ విశ్లేషకుడు పేర్కొన్నారు. మీడియా సంస్థలు కూడా గంప గుత్తగా అదానీ వంటి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఇక రాజకీయాలన్నీ ఏకపక్షంగా సాగుతాయని ఆయన
అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పోకడలకు దారి తీస్తుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ ఒక వివాదాస్పద ప్రచారానికి కారకుడయ్యారని ఆయన సున్నితంగా విమర్శించారు.
వాణిజ్య రంగమైనా, ఏ రంగమైనా ఔత్సాహిక పారిశ్రామికులకు, చిన్నపాటి ఇతర రంగాలవారికీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటేనే దేశం సమగ్రతను సాధించుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఒకేఒక వ్యక్తి చేతుల్లో గుత్తాధిపత్యాన్ని పెట్టేస్తే కలిగే పరిణామాలను ప్రభుత్వం అంచనా వేయాలని కూడా ఆయన సూచించారు.