- జాతీయ స్థాయిలో ‘ఊ’ అంటుందా ? ‘ఊహూ’ అంటుందా ?
- అధినేత గేమ్ ఛేంజర్ అవుతారా ?
- 2024 ఎన్నికల లక్ష్యం దూసుకు పోతుందా ?
- తుస్సుమంటుందా ?
- బీజేపీ కంచుకోటను కొత్త పార్టీ బద్దలు కొడుతుందా ?
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ జాతీయ సమితిగా మారిపోయింది. ఎనిమిదేళ్ల తన ప్రాంతీయ స్థాయిని మార్చుకుని జాతీయ స్థాయికి ఎదగాలనుకుంటోంది. తప్పులేదు. అయితే కేసీఆర్ వ్యూహాలేమిటి ? ఇందుకు ఎంచుకున్న విధానాలేమిటి ? కేవలం కేంద్రంలో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీల కూటమితో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ఆయన టార్గెట్.. ఈ దిశలోనే 2024 ఎన్నికల మీద ఫోకస్ పెట్టి సరికొత్త అడుగు వేశారు. ఇందుకు మొదట బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక మీద కన్నేశారు. జేడీ -ఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన చేతులు కలిపారు. కర్ణాటక తరువాత వీలైతే మహారాష్ట్ర తరువాత ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్ పై దృష్టి పెట్టారు.
దక్షిణాదిన కర్ణాటక మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉంది. ఓ వైపు బీజేపీ తెలంగాణాలో పాగా వేయడానికి వ్యూహాలు పన్నుతుండగా మరో వైపు కేసీఆర్ కర్ణాటకలో బీఆర్ఎస్ పునాదులకోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ సీఎంగా మారిన కుమారస్వామి ఈ కొత్త ‘జాతీయ’ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తనకు కలిగే ప్రయోజనమేమిటో బేరీజు వేసుకుంటున్నారు.
పైగా అంతకు ముందే కేసీఆర్.. తన తండ్రి, మాజీ పీఎం దేవెగౌడను కలిసి తన ‘వేదికను’ రెడీ చేసుకోవడంతో స్వామికి కేసీఆర్ మీద అపార నమ్మకం కలిగింది. ఇక గుజరాత్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, శంకర్ సింగ్ వాఘేలా, ఆయన ఆధ్వర్యంలోని జన వికల్ప్ మోర్ఛాతో చేతులు కలిపి అక్కడా తన బీఆర్ఎస్ ఉనికిని చాటుకోవాలన్నది కేసీర్ వ్యూహం. కర్ణాటకలో ఓల్డ్ మైసూరు మీద పడింది ఆయన దృష్టి. ఇది ఒకప్పుడు నైజాం హయాంలో ఇదివరకటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కర్ణాటకలో ఈయన ప్రాధాన్యం పరిమితంగానే ఉన్నప్పటికీ.. తెలుగువారు చాలామంది ఈ కొత్త పార్టీపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
బీజేపీది అవినీతి పాలన అంటూ విపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నప్పటికీ. ఆ పార్టీ పాలనా ‘రుచిని’ కూడా చూసిన తెలుగువారు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వారికీ కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ కనబడింది. ఇదే సమయంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న సీపీఐ కూడా ఈ పార్టీపై ఆసక్తి చూపుతోంది. ఈ పార్టీ జాతీయ మహా సభలు ఈ నెల 14 న విజయవాడలో జరగనున్న నేపథ్యంలో .ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ.. జాతీయ రాజకీయాలకు అతి ముఖ్యమైనదిగా భావిస్తున్న ఓ విషయం చెప్పారు. బీజేపీ మతతత్వశక్తులను ఎదుర్కోవడానికి తాము కేసీఆర్ ని ఆహ్వానించాలని భావిస్తున్నామని తెలిపారు. పైగా బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వంటివారిని కూడా ఇన్వైట్ చేసి.. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు.
ఇక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, శంకర్ సింగ్ వాఘేలావంటివారితో కలిసి డిసెంబరులో భారీ ర్యాలీ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. మరి.. ఈ టార్గెట్ ఎలా ఉన్నా.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఈయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది..? దీని గుర్తింపు విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వంటివన్నీ చూడాల్సి ఉంది.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెలిగిపోతారా లేక ఈ మిస్ అడ్వెంచర్ తుస్సుమంటుందా వేచి చూడాలి!