గ్రామంలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదంటూ ఓ వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేశాడు. ఇతర కంపెనీలకు చెందిన నాణ్యత లేని బీర్లు తాగడం వల్ల మందు బాబుల ఆరోగ్యం పాడవుతోందంటూ కలెక్టర్ వద్ద వాపోయాడు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
ఈ ఆసక్తికర ఘటన జగిత్యాల జిల్లాల్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన బీరం రాజేశ్ అనే యువకుడు కలెక్టర్ కు ఓ వినతి పత్రాన్ని ఇచ్చాడు. జగిత్యాల పట్టణంలో వైన్ షాప్స్, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమతులు పొందే క్రమంలో వినియోగదారులకు అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచుతామని వైన్స్, బార్ల యజమానులు చెబుతారని, కానీ ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మద్యం ప్రియులు ఇతర బ్రాండ్లు తాగుతున్నారని చెప్పారు.
దీంతో మందుబాబుల ఆరోగ్యం పాడవుతోందన్నారు. కేఎఫ్ బీర్లు తాగాలనుకుంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్లి కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అందువల్ల అన్ని మద్యం షాపుల్లో కేఎఫ్ బ్రాండ్ బీర్లు అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టరును కోరారు.