• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఏమి దేశం…ఏమి దేశం

Published on : May 16, 2020 at 1:50 pm

అశోక్ కుంభం, ప‌రిశోధ‌కుడు

 

కరోనా ఎంత అలజడి రేపుతుందో అంతకంటే స్పష్టంగా దేశ ముఖ చిత్రపు వికారాన్ని కూడా చూపెడుతుంది. నేలనేలంతా కుల, వర్గ, మత గీతలు గీసి మన సమాజపు దుస్థితిని విడమరిచి చెబుతుంది. కాలి నడకన దేశ దౌర్భాగ్యాన్ని కొలుస్తున్న వలస
కూలీల జీవన్మరణ పోరాటంతో పాలకుల దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తుంది. మెదడుతో పని లేకుండానే చప్పట్లు కొట్టి, దీపాలు పెట్టి, గండదీపాలు మోసి “నమో, నమో” అని భజన చేసే భక్తుల ఇరుకు ప్రపంచాన్ని చరిత్రలో రికార్డ్ చేయిస్తుంది. పాలకులు చేసిన లాక్ డౌన్ మాత్రమే కాదు, బ్రేక్ డౌన్ అయిన జీవితాలను కూడా చర్చకు పెడుతుంది. పట్టణ మధ్యతరగతి తమ సౌకర్యాలను చూసుకోని మురిసిపోతుంటే వాటికి అంటిన శ్రామికుల చెమట, నెత్తురులను వాళ్ళ మొఖం మీదే చల్లి don’t take anything for granted అని ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తుంది. లాభాల కోసం తనతో పోటీ పడి కోరలు చాపుతున్న పెట్టుబడి అసలు రూపాన్ని అర్థమయ్యేటట్లు చూపెడుతుంది. అధికార దుర్వినియోగాన్ని, హక్కుల హననాన్ని, పాలకుల పగటేషాలను టీవీల సాక్షిగా బయటపెడుతుంది.

ఇది కరోనాస్వామ్యం. పరాన్నజీవుల ఆదిపత్యస్వామ్యం. మట్టి మనుషులను మళ్ళీ మళ్ళీ పరాయికరణ (alienation) చేసే అమానవీయం.

1990లలో ఆర్థిక రంగంలో వచ్చిన సంస్థాగత మార్పుల మూలంగ ధ్వంసమైన వ్యవసాయ ఆధారిత ఉపాధుల నుండి తరిమివేయబడిన అణగారిన వర్గాలు, కులాలు పొట్ట చేతబట్టుకోని ఎక్కడ పని దొరికితే అక్కడికి పోవడం మొదలయ్యింది. అలా మొదలయిన వాళ్ళు ఊర్లు దాటిండ్రు, జిల్లాలు దాటిండ్రు, రాష్ట్రాలు దాటిండ్రు. కొందరు దేశాలు దాటిండ్రు. చివరికి వలస కూలీలయ్యిండ్రు.

ఆ వలస కూలీలు పరాయికరణే జీవిత సూత్రమైన వాళ్ళు. వారి జీవితాల నుండి, కుటుంబాల నుండి, తమ ప్రకృతి నుండి, శ్రమ నుండి, విపత్కాలంలో మొత్తం సమాజం నుండి పరాయీకరణ కాబడినవారు. మొదటిసారి వాళ్ళు మనకు దేశం రోడ్డు పొడుగునా బారులు తీరిన చీమల్లా కనబడుతున్నారు. మన భద్రజీవితపు సౌకర్యాలను ఎగతాళి చేస్తున్నారు. “ఇంత పెద్ద దేశంలో ఆ మాత్రం అసౌకర్యం ఉండదా” అని తీరికబోతు (బహుశా తిరుగుబోతులు కూడా ఈ మాట అనరేమో!) మాటలు చెప్పే మధ్యతరగతి మానవత్వాలను ప్రశ్నార్థకం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ మీద ఎప్పటి నుండో జరుగుతున్న దోపిడీ, పీడనల కొనసాగింపే ఈ కరోనా కాలపు హింస.

గుజరాత్ లో ఈ శ్రామికుల మీద పరిశోధన చేసిన యాన్ బ్రెమన్ అనే డచ్ సామాజిక శాస్త్రవేత్త వీళ్ళను “footloose labour” అనే భావనతో విశ్లేషించాడు. ఆ footloose labour ఇప్పుడు వలస ఉపాధి కూడా పోయి, తిరిగి ఇంటికి వెళ్ళే సౌకర్యం లేని పరిస్థితుల్లో (labour moving on foot గా) వందల కిలోమీటర్లు నడిచిపోతున్నారు.

పాలకులకు వలస కార్మికుల జీవితాలను అంచనా వేసే బౌద్ధిక స్థాయి, రాజకీయ విజ్ణత లేవు. బహుశా వాళ్ళకు అవసరం కూడా లేదేమో. అసలు పట్టణ జీవితంలో వలస కూలీల పాత్ర ఏమిటన్న సోయి వాళ్ళకు ఉండి ఉంటే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే అనే మనిషితనపు సృహ ఉండి ఉంటే కనీసపు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు. నిజమే ఇప్పటి రాజకీయ స్థితిలో పాలకుల నుండి మనిషి లక్షణాలను కోరుకోవడం గొంతమ్మ కోరికే!

అయితే పాలకుల దుర్మార్గాలు ఎప్పుడు వుండేవే. అవే ఇప్పుడూ కనబడుతున్నాయి. అందులో కొత్తేమి లేదు. కాని కష్టకాలంలో ఒక మనిషి కోసం మరో మనిషి నిలబడటం, సాయం చెయ్యడం (ఎంతదైనా సరే) గొప్పదే. దానిని తప్పక మన అనుభవంలో, ఆలోచనలో భాగం చేసుకోవాలి. అదే కదా మనం మానవ సమాజంలో బతుకుతున్నామనే భావనకు భరోసా ఇచ్చేది.

ఈ విపత్తు కాలంలో ఎందరో వ్యక్తులు, సమూహాలు, సంస్థలు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఆపదలో ఉన్న తోటి మనుషులను (వలస కూలీలను) ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే “ఎంత సాహసవంతులు అయితే తప్ప వందల కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించరు, ఆ సాహసాన్ని అర్థం చేసుకుందామని” వలస కూలీలతో ప్రయాణించాడు ఒక ఫిల్మ్ మేకర్. తన ప్రయాణంలో దారి పొడువునా వికసించిన బడుగు జీవుల మానవత్వాన్ని కూడా రికార్డ్ చేశాడు. అతనే వినోద్ కాప్రి. ఒక సీనియర్ జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. అతని 2014 డాక్యుమెంటరీకి (“Can’t Take This Shit Anymore”) జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు, అవార్డులు వచ్చాయి. వినోద్ కాప్రి వలస కూలీలతో చేసిన ప్రయాణాన్ని తనను ఇంటర్వ్యూ చేసిన అవుట్ లుక్ జర్నలిస్ట్ సలిక్ అహమ్మద్ తో పంచుకున్నాడు. ఆ సంభాషణ ఇలా కొనసాగింది…

మీ ప్రయాణం ఎలా మొదలయ్యింది?

ఏప్రిల్ 13 నాడు నేను ట్విట్టర్ లో ఒక వార్త చూశాను. దాదాపు 30-40 మంది వలస కార్మికులు తినడానికి తిండి కాని, కొనడానికి డబ్బులు కాని లేక గజియాబాద్ (ఉత్తరప్రదేశ్)లో ‘లోని’ అనే ప్రాంతంలో ఉండిపోయారని తెలిసింది. అది తెల్వగానే వారికి కొంత డబ్బు చేరే ఏర్పాట్లు చేసిన. మళ్ళీ 3-4 రోజుల తర్వాత వాళ్ళనుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొనుకున్న సరుకులన్నీ అయిపోయినవని చెప్పిండ్రు. తిండి కోసం డబ్బులు అడుక్కోవడం వాళ్ళకు చాలా ఇబ్బందింగా వుందని బాధను వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆత్మగౌరవం కల్గిన మనుషులు.

మళ్ళీ సరఫరా చేసిన సరుకులు అయిపోవడంతో బీహార్ లో ఉన్న వారి ఊరు ‘సహర్స’ కు పోయే మార్గం ఏదైనా వుందా అని అడిగిండ్రు. ఈ పరిస్థితుల్లో ఊరికి పోవాలనుకోవడం ప్రమాదకరమని చెప్పిన. “చావనైనా చస్తాం కాని ఇలాంటి స్థితిలో వుండలేం” అని చెప్పారు. నేను ఏప్రిల్ 27న వాళ్ళకు ఫోన్ చేస్తే అప్పటికే వాళ్ళలో ఏడుగురు ఊరికి బయలిదేరి వెళ్ళారని చెప్పారు. నేను వెంటనే వాళ్ళ ఊరు సహర్స ఎంత దూరం వుందో తెలుసుకుందామని గూగుల్ లో కొట్టి చూసిన. 1200 కిలోమీటర్లు అని తెలుసుకోని షాక్ అయిన. వెంటనే వీళ్ళ ప్రయాణాన్ని ఎలాగైనా డాక్యుమెంట్ చేయాలని నా టీం తో కలసి కార్లో బయలుదేరిన. తెల్లారి పొద్దున్నే (150 కిలోమీటర్ల దూరంలో ఉన్న) సంబల్ దగ్గర వాళ్ళు మాకు కనిపించారు.

మీ ప్రయాణం గురించి చెప్పండి?

వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టిన మొదటి రోజే వాళ్ళను పోలీసులు పట్టుకోని విపరీతంగా కొట్టారు. వెనక్కి వెళ్ళిపొమ్మని ఆర్డర్ వేశారు. కాని వాళ్ళు ఎలాగైనా ఇంటికి పోవాలనుకోని వేరే ప్రత్యామ్నాయ దారి వెతుకున్నరు. ఆ ఏడుగురులో ఒకతనికి టెక్నాలజీ ఎలా వాడాలో బాగా తెలుసు. గూగుల్ మ్యాప్ లో అక్కడి నుండి కాలిబాటన ఎట్లా పోవాలో దారి తెలుసుకున్నడు.
అదే రాత్రి వాళ్ళు గంగా నది దాటడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలను చూసిన అక్కడి జాలరులు “అసలు నది ఎంత లోతు ఉంటుందో తెలుసా మీకు” అని చెప్పి వాళ్ళను వారించరు. అయినా వినకుండ నది దాటే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను చూసి ఏమనిపించిందో “ఇక్కడే వుండండి పొద్దున్నే పడవల్లో నది దాటిస్తం” అని చెప్పారు. వాళ్ళకు తోడు వాళ్ళ సైకిళ్ళు. వాటితో నది దాటడం అసాధ్యమైన పని.

సైకిళ్ళు మరో సమస్య. వాళ్ళ ఇంటి దగ్గరి నుండి డబ్బులు తెప్పించుకోని సెకండ్ హాండ్ సైకిళ్ళను కొన్నరు. అవి అప్పటికే సరిగ్గా లేవు. ఇక దారి పొడుగున వాటితోని ఒక సమస్య కాకపోతె మరొకటి. దారిలో ఏదైనా సమస్య వస్తే సైకిల్ రిపైర్ చేసే మనిషి దొరికే వరకు దానిని లాక్కుంటూనే పోవాలి.

వాళ్ళు ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నరు?

తిండి ప్రధానమైన సమస్య. వాళ్ళ దగ్గర కొంత శనిగలు, బార్లీ గింజలు మాత్రమే ఉన్నయి. లాక్ డౌన్ మూలంగా అన్ని హోటల్స్ కూడా మూసేసిండ్రు. ఎక్కడైన ఒక దగ్గర ఏదైనా కిరాణ దుకాణం కనిపిస్తే బ్రెడ్ కొనేటోల్లు. లేదంటే అరటిపండ్లు కొనేది. వాళ్ళు అప్పటికే స్నానాలు చెయ్యక చాలా రోజులయ్యింది. అందరు ఒకే దగ్గర స్నానం చేస్తే ఎవరైన చూసి పోలీసులకు చెప్తే మళ్ళీ చావు దెబ్బలు కొడుతరని భయపడి అంత వేడికి స్నానం చెయ్యాలని వున్నా చెయ్యలేదు. రాత్రిల్లు బయట పడుకుంటే దోమలు, పురుగులు నిద్ర పట్టనిచ్చేవి కావు.

వాళ్ళకు ఎవరైనా సాయం చేశారా?

చేసిండ్రు. వాళ్ళు లక్నో (బయలుదేరిన దగ్గరి నుండి 530 కిలోమీటర్లు) చేరేసరికి వాళ్ళ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. వాళ్ళ భుజాలు కిందికి జారిపోయినట్లు అయినయి. దారిలో పోతున్న ఒక ట్రక్ డ్రైవర్ వాళ్ళ పరిస్థితికి జాలి పడి 30 కిలోమీటర్లు ఎక్కిచ్చుకోని పోయిండు. అక్కడి నుండి మళ్ళీ సైకిల్ తొక్కడం మొదలు పెట్టిండ్రు. మరో ట్రక్ డ్రైవర్ గోరక్ పూర్ వరకు (దాదాపు 100 కిలోమీటర్లు) లిఫ్ట్ ఇచ్చిండు. అది వాళ్ళ ప్రయాణాన్ని కాస్త సులభం చేసింది.

వాళ్ళు ఇంకా వాళ్ళ ఊరికి 350 కిలోమీటర్ల దూరంలో వుండగా బీహార్ సరిహద్దుకు చేరిండ్రు. వెంటనే అక్కడ కరోనా సోకిందా లేదా అని వ్యాది లక్షణాల కోసం పరీక్షించిండ్రు. అక్కడ బీహార్ పోలీసులు వాళ్ళను తమ ఆధీనంలోకి తీసుకోని వాళ్ళ ఊరికి దగ్గర్లో ఉన్న మరో గ్రామంలో క్వారంటైన్ చేసిండ్రు. బీహార్ ప్రభుత్వం బీహారీళ్ళను వాళ్ళ గ్రామాలకు దగ్గర్లోనే క్వారంటైన్ చేసే ఏర్పాట్లు చేసి మంచి పని చేసింది.

వాళ్ళు వాళ్ళ ఊరు చేరిన తర్వాత ఎలా స్పందించారు?

అది ఎంత భావోధ్వేగమైన సందర్భమో నేను చెప్పలేను. క్వారంటైన్ గ్రామానికి తీసుకొని పొయ్యే ముందు కొంతసేపు వాళ్ళ సొంత ఊరికి వాళ్ళను తీసుకుపోయిండ్రు. ఊర్లోకి పోగానే వాళ్ళంతా సంతోషంతో అరవబట్టిండ్రు. నేను వాళ్ళతోనే వున్న. ఆ కొద్దిసేపట్లనే వాళ్ళ అందమైన చిన్న ఊరంతా చూపించిండ్రు. వాళ్ళు స్నానాలు చేసే కొలను, గుడి, మొక్కజొన్న పొలాలకు…ఇలా ఊరు మొత్తం చూపించిండ్రు. ఇక వాళ్ళ ఊరి నుండి బస్సు క్వారంటైన్ చెయ్యాల్సిన ఊరికి పోతుంటే ఆ బస్సు వెనకాలే వాళ్ళ బంధువులు, మిత్రులు ఏడుస్తూ పరిగెత్తిండ్రు. అయినా వాళ్లలో కొంత ప్రశాంత అయితే కనిపించింది ఎందుకంటే ఊరికి చేరిండ్రు కాబట్టి. నేను, నా టీం ఆ రోజు ఆ ఊర్లోనే ఉన్నము. ఎంత మర్యాద చేసిండ్రో! మొత్తానికి వాళ్ళ ప్రయాణం మంచిగ ముగిసింది.

ఈ ప్రయాణం మంచిగా ముగియదేమో అని మీరు ఎప్పుడైనా భయపడ్డారా?

అవును. ఆ భయం దారి పొడుగున వుండె. కార్మికులు నడుస్తూ నడుస్తూనే పడిపోతున్నరని, చనిపోతున్నరని, ప్రమాదాలకు గురవుతున్నరని… ఇలా ఎన్నో వార్తలు చాలా రిపోర్ట్ లలో చదివిన. అందుకే భయపడిన. ముఖ్యంగా లాక్ డౌన్ మూలంగా రోడ్డు మీద తక్కువ వాహనాలు ఉండటంతో ట్రక్కులు విపరీతమైన వేగంగా పోతున్నవి. దారి పొడుగున ఒక్కటే మొక్కుకున్న. ఈ ఏడుగుర్లో ఎవ్వరు కూడా అలసిపోయో, ఆ ట్రక్కుల వేగానికి కంట్రోల్ తప్పో వాటి కింద పడొద్దని.

మొత్తం ప్రయాణంలో కొన్ని సంతోషపడే సందర్భాలు కూడా వుండి ఉంటాయి కదా.

ట్రక్కులో 100 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు చాలా సంతోషపడ్డరు. వాళ్ళ ఊరికి చేరిన తర్వాత ఆ ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు రాత్రి అందరం కలసి భోజనం చేసినం. వాళ్ళు మాకోసం భోజ్ పూరి పాటలు పాడిండ్రు. ఆ అందమైన సాయంత్రాన్ని నేను మర్చిపోలేను. చివరిగా మీము ఊరు వదిలి వస్తుంటే వాళ్ళు మమ్ముల పట్టుకోని ఏడ్చిండ్రు. మళ్ళీ తప్పకుండా కలుద్దామని ఒకరికొరం ప్రామిస్ చేసుకున్నం.

ఈ ప్రయాణం మీలో ఏమైనా మార్పును కలిగించిందా?

ఈ పని చెయ్యాలని అని అనుకోగానే నాకు కల్గిన ఒకే ఒక కుతూహలం ఏమంటే ‘అసలు మనుషులు ఇంత పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకుంటారు?’ అని. ఎవరీ సాహసులు? వాళ్ళను దగ్గరి నుండి చూడాలి అనే కోరిక కల్గింది. మా ఇళ్ళు ను రెండు సార్లు మరమత్తు చేయించిన. ఇలాంటి వాళ్ళే చేశారు. ఇప్పుడు వాళ్ళను చూసే దృష్టి మారింది.

అన్నింటికంటే ముఖ్యంగా దారిలో చెడ్డ వాళ్లకంటే మంచి వాళ్ళనే ఎక్కువ చూసినం. దారిలో దొరికిచ్చుకోని చిదకబాదిన పోలీసులను మాత్రమే నేను గుర్తు పెట్టుకుంటానా? లేదు. నేను బాగా గుర్తుపెట్టుకోనేది సైకిల్ కు పంక్చర్ రిపేర్ చేసి వలస కార్మికుల దగ్గర 30 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించిన ఆ మనిషిని. కేవలం చాయ్ మాత్రమే అమ్ముకునే మనిషి మా కథ విని ఆ పూట సమోసాలు చేసి ఇచ్చిండు. పోలీసులు పట్టుకుంటే ఇరవై వేల జరిమాన వేస్తరని తెలిసి కూడా మా గాధ విని కరిగిపోయి వ్యక్తిగత రిస్క్ తీసుకొని కార్మికులకు లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్లు. వీళ్ళను గుర్తు పెట్టుకుంట. కేవలం దెబ్బలు కొట్టిన పోలీసులను మాత్రమే కాదు. నిజంగానే ప్రపంచంలో చెడు కంటే మంచే ఎక్కువుంది.

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సీసీ కెమెరాల నిఘాలో బాలీవుడ్ హీరో పెళ్లి

సీసీ కెమెరాల నిఘాలో బాలీవుడ్ హీరో పెళ్లి

Sai Dharam tej Republic Movie Released on April

ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రిపబ్లిక్?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని లైన్లో పెట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని లైన్లో పెట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్

అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్న స‌మంతా

అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్న స‌మంతా

నితిన్ చెక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ చెక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

10thclass Exams time table

మే 17నుండి తెలంగాణ పదో తరగతి పరీక్షలు- వేసవి సెలవులు ఎన్నంటే

ఇండియాలో అదుపులోకి వ‌స్తున్న క‌రోనా కేసులు

ఇండియాలో అదుపులోకి వ‌స్తున్న క‌రోనా కేసులు

అయోధ్య రాముడికి కేసీఆర్ విరాళం ఎంతో...?

అయోధ్య రాముడికి కేసీఆర్ విరాళం ఎంతో…?

అధికారుల‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ హెచ్చ‌రిక‌- ఏపీలో ముదిరిన పంచాయితీ

అధికారుల‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ హెచ్చ‌రిక‌- ఏపీలో ముదిరిన పంచాయితీ

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే

పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది

పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)