కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం మొత్తం అంతుచిక్కని వ్యాధికి బలైపోయింది. కుటుంబంలోని సభ్యులు వరుసగా ఒకరి తరువాత ఒకరు మృతి చెందారు. నెల రోజుల వ్యవధిలోనే నలుగురు మృతి చెందడంతో పెను విషాదాన్ని నింపింది. దీంతో వీరి మరణాలు మిస్టరీగా మారాయి.
కరీంనగర్ జిల్లా గంగాధర్ కు చెందిన ఓ కుటుంబంలో అంతుచిక్కని వింత వ్యాధి వరుస మరణాలకు దారి తీసింది. 40 రోజుల్లో శ్రీకాంత్, భార్య మమతతో పాటు ఆరేళ్ల కూతురు అమూల్య, 20 నెలల పసిబిడ్డ అద్వైత్ ఒకరి తరువాత ఒకరు మరణించారు. అయితే వీరంతా వాంతులు చేసుకుంటూ చనిపోయినట్లు స్థానికులు వెల్లడించారు.
ఇక ఈ వ్యాధి ఏంటనేది ఇప్పటికీ తెలియడం లేదు. ఈ మాయదారి రోగం వైద్యులకు కూడా అంతుబట్టడం లేదు. మరణించిన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. గంగాధర పోలీసులు ఈ మిస్టరీ డెత్స్ పై విచారణ కొనసాగిస్తున్నారు.ముందుగా శ్రీకాంత్ భార్య, పిల్లలు వరుసగా మరణించారు. ఆ తరువాత శ్రీకాంత్ కూడా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందరుతూ మరణించారు.
అయితే మరణించే ముందు శ్రీకాంత్ వాంతులు చేసుకుంటూ ప్రాణాలు వదిలారు. అంతకు ముందు భార్య,పిల్లలు కూడా ఇదే తరహాలో మరణించడం.. గ్రామంలో విషాదాన్ని నింపింది. అయితే ఇలా అంతుచిక్కని వ్యాధితో శ్రీకాంత్ మొత్తం కుటుంబం మరణించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాధికారులు వెంటనే దర్యాప్తు చేసి ఆ మరణాల వెనుకున్న మిస్టరీని ఛేదించాలని వేడుకుంటున్నారు.