భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది. రాత్రికి రాత్రే ఆ స్థలంలో ఇళ్ళు, కరెంట్ మీటర్లు పుట్టుకొచ్చాయి. ఎలాగైనా ఆ ల్యాండ్ ను కొట్టేయాలని భూ బకాసురులు క్రమబద్దీకరణ పేరిట దరఖాస్తులు సైతం చేసుకుంటున్నారు. ఇలా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలో అక్రమార్కుల బాగోతం యథేచ్ఛగా కొనసాగుతుంది.
లక్ష్మీదేవి పల్లి పంచాయితీ పరిధిలోని ఒకటో నెంబర్ సర్వేలో ఉన్న అత్యంత విలువైన భూమి పై స్థానికంగా ఉన్న కొందరి కన్ను పడింది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలం కావడంతో.. గజం వేల రూపాయల ధర పలికే అత్యంత విలువైన భూమిని స్వాహా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తం ఏడు ఎకరాల భూమిని కొట్టేయడానికి చక్రం తిప్పుతున్నారు. దీని విలువ అక్షరాలా..35 కోట్లు. అయితే ఇదే సర్వేలో ఉన్న మరి కొంత భూమిని కూడా ఇదే తరహాలో కొట్టేయడానికి మరో వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం.
ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు శాశ్వతంగా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.59 ను అడ్డుగా పెట్టుకొని కోట్లు విలువ చేసే భూమిని కొట్టేద్దామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడే ఉన్న పల్లె ప్రకృతి వనం సమీపంలో ఉన్న ఎకరం స్థలాన్ని కబ్జా చేసుకున్న కొందరు అక్రమార్కులు దాన్ని అమ్మడం కూడా మొదలు పెట్టారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వాధికారులు మాత్రం కళ్లు మూసుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.