తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కాలేజీల్లో యాజమాన్యాల వేధింపులు, మార్కులు పేరుతో ఒత్తిడి, సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించడం వంటి కారణాలతో విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది.
హనుమకొండలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నాగజ్యోతి అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె వసతి గృహంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కళాశాల యాజమాన్యం.. విద్యార్థినిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నాగజ్యోతి చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచింది. మృతురాలు కొడకండ్ల మండలానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఇంటర్ పరీక్షలు ఇటీవల ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగజ్యోతి నిన్న ఉదయం ఇంటర్ పరీక్ష రాసింది.
అనంతరం ఆత్మహత్యకు పాల్పడడం అనేక సందేహాలకు దారితీస్తోంది. ఇంటర్ పరీక్ష సరిగ్గా రాయలేదనే మనస్థానికి గురైందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫెయిల్ అవుతాననే మనస్తాపంతో డిప్రెషన్ కు లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.