ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినూత్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమంలో కుర్చీపైకి ఎక్కి చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. ఐదేండ్ల కాలంలో తాను చేసిన తప్పులను క్షమించాలని ఓటర్లను వేడుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాబర్ట్స్‌గంజ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే భూపేష్ చౌబే.. ఈసారి కూడా అదే స్థానం నుంచి తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్థానికంగా అతనికి వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ,, బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చింది. మార్చి 7న జరిగే చివరి దశలో ఇక్కడ పోలింగ్ జరుగనున్నది.
కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ఆయన బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గం ప్రజలను పొడగ్తలతో ముంచెత్తారు. మరోసారి వారి ఆశీసులు తనకు కావాలని కోరారు.
2017లో మాదిరిగా తనను ఎమ్మెల్యేగా తిరిగి గెలిపించాలని అభ్యర్థించారు చౌబే. గత ఐదేండ్లలో తన వల్ల జరిగిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు. అయితే.. వేదికపై ఉన్న మిగతా బీజేపీ నేతలు ఆయనను వారించేందుకు ప్రయత్నించారు. దీంతో నెటిజన్లు ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్ లు పెడుతున్నారు.