తలిదండ్రులకు పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ ఏమీ ఉండవ్ సరికదా..తిరిగి తలిదండ్రులే పిల్లల భవిష్యత్తుకోసం ఆస్తిపాస్తులు కూడబెడతారు.తమ బిడ్డల నుంచి వాళ్ళు ఆశించేది ఒకటే. కాస్త ప్రేమ,చివరి దశలో ఇంకాస్త కేరింగ్.
ఇలాంటి ఆదరణ, అభిమానాలు ఏవీ ఆ వృద్ధుడికి తన పిల్లల నుంచి దక్కలేదు. పిల్లల కోసం ఇంత చేసిన నాకు వాళ్ళిచ్చే గౌరవం ఇదా.?! అనుకున్నాడు. చేసింది ఇక చాలు అనుకున్నాడు.
తాను చనిపోయే ముందే తన పిల్లలపై తనకున్న మమకారాన్ని, వాత్సల్యాన్నీ చంపేసుకున్నాడు. కోటిన్నర విలువ చేసే యావదాస్తినీ ప్రభుత్వానికే చెందేలా రాసేసాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నాథూ సింగ్ అనే 85 ఏళ్ల వృద్ధుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రూ.1.5 కోట్లు విలువ చేసే తన ఆస్తిని ప్రభుత్వం పేరిట వీలునామా రాశారు.
మరణానంతరం తన శవాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని కోరారు. తన కుమారుడు, కుమార్తెలు కనీసం తన శవాన్ని కూడా తాకొద్దని వీలునామాలో పేర్కొనడం గమనార్హం.
అందిన సమాచారం ప్రకారం. ముజఫర్‌పుర్‌కు చెందిన నాథూసింగ్‌కు ఓ ఇల్లుతో పాటు స్థలం కూడా ఉంది. వాటి విలువ రూ.1.5 కోట్లు. ఆయనకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లయ్యాయి.
కుమారుడు సహరాన్‌పుర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య చనిపోయిన తర్వాత నాథూ సింగ్ చాలా కాలం ఒంటరిగానే గడిపారు. ఏడు నెలల క్రితం సొంత ఊళ్లోనే ఉన్న ఓ వృద్ధాశ్రమానికి మారారు.
కనీసం చూడడానికి కూడా తనవారెవరూ రాకపోవడంతో నాథూ సింగ్ మనసు విరిగింది. తన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం పేరిట రాయాలని నిశ్చయించుకున్నారు. తన మరణం తర్వాత ఆ స్థలంలో ఆసుపత్రి, పాఠశాల నిర్మించాలని కోరారు.
‘‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సింది. కానీ, వాళ్లు నన్ను బాగా చూసుకోవడం లేదు. అందుకే నేను నా ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని నాథూ సింగ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.
నాథూ సింగ్ నుంచి తమకు అఫిడవిట్ అందిందని స్థానిక సబ్-రిజిస్ట్రార్ తెలిపారు. ఆయన మరణం తర్వాత ఆ వీలునామా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.