ఇండియన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే మ్యాచ్ లు కొన్ని ఉంటాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే మ్యాచ్ గత ఏడాది ఇదే రోజు ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత విస్మయకర ఓటమి, ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఘనమైన విజయాల్లో ఒకటి ఆ మ్యాచ్. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని కుర్రాడు సొంత దేశంలో, తిరుగులేని మైదానంలో చుక్కలు చూపించి మ్యాచ్ ను గెలిపించాడు.
అతడే ఢిల్లీ డైనమైట్ రిషబ్ పంత్. 2020/21 ఆసిస్ పర్యటనకు వెళ్ళిన టీం ఇండియా కీలక ఆటగాళ్ళు లేకపోయినా సరే ఆ సీరీస్ ను గెలుచుకుంది. వివ్ రిచర్డ్స్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు 1988లో గబ్బాలో గెలిచిన చివరి జట్టుగా మిగిలిపోతే ఆ రికార్డులను చెరిపేస్తూ ఇండియన్ టీం సరికొత్త చరిత్రను లిఖించింది. పంత్ అజేయంగా 89 పరుగులు చేసి ఆసిస్ కు ఘోర ఓటమిని రుచి చూపించాడు.
మూడో టెస్టు డ్రా అయినా సరే నాలుగో టెస్ట్ లో మంచి విజయాన్ని అందుకుంది టీం ఇండియా. మూడో టెస్ట్ ను విజయవంతంగా డ్రా చేసిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ గాయాలతో చివరి మ్యాచ్ కు అందుబాటులో లేరు. కూతురు పుట్టడంతో విరాట్ కోహ్లీ ఒక టెస్ట్ ఆడి ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేసాడు. కీలక ఆటగాళ్లుగా చెప్పుకునే వారు ఎవరూ లేకపోయినా అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ తో మంచి పోరాటం చేసింది ఇండియా జట్టు.
2018/19లో ఆస్ట్రేలియాలో సీరీస్ గెలిచినా సరే అప్పుడు ఆస్ట్రేలియా జట్టు బలంగా లేకపోవడంతో గెలిచారని కామెంట్స్ చేసారు. అయితే గత ఏడాది టూర్ లో మాత్రం ఆస్ట్రేలియాలో అందరూ ఉన్నా ఇండియన్ టీంలో మాత్రం అందరూ యువకులే. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ మరియు జస్ప్రీత్ బుమ్రా మరియు స్పిన్ బౌలింగ్ ఆల్-రౌండర్లు రవీంద్ర జడేజా మరియు అశ్విన్ సీరీస్ లో చివరి మ్యాచ్ కు ముందు గాయాల పాలయ్యారు.
మహ్మద్ సిరాజ్, టి నటరాజన్, శార్దూల్ ఠాకూర్, గాయపడిన నవదీప్ సైనీ మరియు వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన బౌలింగ్ అటాక్‌తో గబ్బా టెస్ట్ లో టీం ఇండియా ముందుకు వెళ్ళింది. సిరీస్‌లోని రెండవ టెస్ట్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్ చివరి టెస్ట్ లో సీనియర్ బౌలర్ పాత్ర పోషించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌కి ఛేజింగ్‌కు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు.
తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో సుందర్, ఠాకూర్ అద్భుతమైన పోరాట పటిమతో జట్టుని ముందుకు నడిపించారు. ఇద్దరూ 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్ళ పోరాటంతో ఇండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. 328 పరుగుల లక్ష్య చేదనతో బరిలోకి దిగిన ఇండియా టీంకు ఓపెనర్ గిల్, సీనియర్ ఆటగాడు పుజారా మంచి పునాది వేసారు.
ఇద్దరూ అవుట్ అయిన తర్వాత విజయంపై అనుమానాలు ఉన్నా సరే పంత్ మాత్రం వెనక్కు తగ్గలేదు. వికెట్ లు పడే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో సుందర్, పంత్ జోడీ కేవలం 55 బంతుల్లో 53 పరుగులు చేసి విజయానికి బాటలు వేసి చిరకాల విజయాన్ని అందించారు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 146 బంతుల్లో 91 పరుగులు, ఛెతేశ్వర్ పుజారా 211 బంతుల్లో 56 పరుగులు, సుందర్ 29 బంతుల్లో 22 పరుగులతో గబ్బాలో కంగారులను కంగారు పెట్టించారు.