– కోమటిరెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం?
– కమలం గూటికి చేరే టైం వచ్చేసినట్టేనా?
– కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవడం సాధ్యమేనా?
– హస్తం నేతలు ఏమంటున్నారు?
– రాజకీయ పండితుల అంచనాలు ఏంటి?
జోడో యాత్ర, అదానీ వ్యవహారంపై పోరాటంతో దేశ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ అమాంతం పెరిగిందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ బయటా లోపల ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తొమ్మిదేళ్లు అప్రతిహతంగా.. తనకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీకి అదానీ వ్యవహారం గుదిబండగా మారింది. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు అట్రాక్షన్ తెచ్చిన రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అదానీ కుంభకోణంపై చెలరేగిన తీరు కాంగ్రెస్, రాహుల్ ఇమేజ్ ను పైకి తీసుకెళ్లిందని అంటున్నారు.
సీన్ కట్ చేస్తే.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదిలో అంతో ఇంతో పుంజుకున్నామన్న భావనలో ఉంది బీజేపీ. కర్నాటక, తెలంగాణలో మాత్రమే ఉనికి ఉన్నా అదానీ ఇష్యూతో ఇప్పుడది దెబ్బతింటోందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి జీవం పోసేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైకి చూడడానికి అవి తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన వ్యాఖ్యలుగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ స్కెచ్ లో భాగమేననే చర్చ కూడా జరుగుతోంది.
తెలంగాణపై బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. అయితే.. అదానీ ఇష్యూ తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతోందని.. ఆ ప్రభావం తెలంగాణపైన కూడా గట్టిగానే కనిపిస్తోందని అంటున్నారు ఆపార్టీ నేతలు. నిన్నటి వరకు కాంగ్రెస్ అవకాశాలపై అనుమానంగా ఉన్నా.. సామాన్య జనంలో సైతం ఇప్పుడు టాక్ మారిందనేది వారి వాదన. సరిగ్గా ఈ సమయంలో హంగ్ అంటూ కోమటిరెడ్డి మాట్లాడటం ఎవరికి లాభం అనే ప్రశ్న వినిపిస్తోంది. కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని సొంత పార్టీ ఎంపీనే.. బహిరంగంగా మాట్లాడటం ఎవరి స్కెచ్ లో భాగంగా ఇది జరిగిందనే చర్చ జోరందుకుంది.
బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదని రాహుల్ గాంధీ పదే పదే చెబుతూ వస్తున్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంలోనే కాదు.. అంతకు ముందు వరంగల్ లో జరిగిన రైతు గర్జన సభలో సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో స్నేహం కోరుకునే వారెవరైనా సరే పార్టీ నుండి వెళ్లిపోవచ్చు.. లేదా మేమే గెంటేస్తాం అనే హింట్ ఇచ్చారు. పార్టీ అగ్రనేత నుండి ఇంత స్పష్టమైన ప్రకటన ఉన్న తర్వాత కూడా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో కలుస్తాం అంటూ కోమటిరెడ్డి ప్రకటించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయి అనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఏకైక అల్టర్నేటివ్ బీజేపీనే అని కోమటిరెడ్డి చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారని అనుకుంటున్నారు. ఇది కూర్చొన్న కొమ్మను నరుక్కోవడం లాంటిదే కదా అన్నది పొలిటికల్ ఎనలిస్టుల వాదన.
టోటల్ గా ఈ ఎపిసోడ్ ని గమనిస్తే… కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారం జోరందుకుంది. కమలం పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లోనే కోమటిరెడ్డి ఈ ప్రకటన చేశారన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ముద్ర వేయాలన్న బీజేపీ వ్యూహాన్ని ఆపార్టీ ఎంపీ చేతనే అమలు చేయించారన్న భావన వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి గల్లీ స్థాయి లీడర్ కాదు.. ఆయనో ఎంపీ. అంటే జాతీయ స్థాయి నాయకుడు. ఆయన మాట్లాడే మాట జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుంది. ఈ విషయం తెలియకనే కోమటిరెడ్డి కామెంట్ చేశారని చెప్పలేం. మునుగోడు ఎన్నికల సమయంలోనే వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. అయితే.. ఇప్పుడు ఆ టైం వచ్చేసిందా అన్న డౌట్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి బీజేపీ గూటికి వెళ్లేందుకు ముహూర్తం ఖరారయ్యేందుకే ఇలాంటి కామెంట్స్ చేశారా అని అంతా అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఒక్కొక్కరుగా కోమటిరెడ్డిపై ఎటాక్ స్టార్ట్ చేశారు.