– గల్లీలో ప్రగల్భాలు..
– ఢిల్లీలో వంగి వంగి దండాలు..!
– ఆర్నెల్లకోసారి యుద్ధమంటూ హడావుడి
– చేసింది మాత్రం శూన్యం..!
– ప్రకటనలకే పరిమితమైన కేసీఆర్!
– ఇప్పుడు మళ్లీ యుద్ధమంటూ రాజకీయాలు
– ఈ యుద్ధం ఎన్నాళ్లు సారూ..!
కేంద్రంపై యుద్ధం చేస్తా.. భూకంపం సృష్టిస్తా.. ఆర్నెల్లకోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ చేప్పేదే ఇది. ఇంతవరకు ఆయన కేంద్రంపై చేసిన యుద్ధమేంటో..? ఆయన సృష్టించిన భూకంపం ఏంటో ఎవరికీ తెలియదు. రోజులు.. నెలలు.. ఏళ్లు గడుస్తున్నాయేగానీ మీ అధినేత ఏం చేశారని ప్రశ్నిస్తే.. టీఆర్ఎస్ శ్రేణులు సైతం మౌనంగా ఉండే పరిస్థితి అని అంటున్నారు రాజకీయ పండితులు. దానికి కారణాలు లేకపోలేదని.. కొన్ని ఉదాహరణలను చెబుతున్నారు.
ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం…
2018 ఏప్రిల్ 27.. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం.. కేసీఆర్ మైక్ అందుకున్నారు. థర్డ్ ఫ్రంట్ ప్రకంపనలు మొదలయ్యాయి.. హైదరాబాద్ నుంచి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రకటించారు. 2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పాలనలో దారుణంగా విఫలమయ్యాయని కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ తరహా కూటమిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు హైదరాబాద్ నుంచే ప్రయత్నాలు మొదలుపెడతానని, డిసెంబర్ రెండో వారంలో రీజినల్ కాంక్లేవ్ ఏర్పాటు చేస్తానన్నారు. కొందరు నేతలను కూడా కలిశారు. కానీ.. 2019 జనరల్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందిబి మోగించడంతో ఆ రెండింటిపై సైలెంట్ అయిపోయారు కేసీఆర్.
కేంద్రంతో యుద్ధమని ప్రగల్భాలు పలికిన సీఎం.. కేవలం ప్రకటనతోనే సరిపెట్టారని గుర్తు చేశారు రాజకీయ విశ్లేషకులు. ఆ సమయంలో ఢిల్లీ పర్యటనే కేసీఆర్ మార్పునకు కారణమని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్ళడానికి ముందు వరకూ స్పష్టమైన వైఖరితో ఉన్న కేసీఆర్.. హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించి ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిన కేసీఆర్… భారత్ బంద్ వరకూ కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి ఢిల్లీలో సింగిల్ సిట్టింగ్ తో వెనకడుగేశారని అప్పటి విషయాలను గుర్తు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ అంతే. 2021 నవంబర్ 18.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. తాను ఎత్తేసిన ధర్నాచౌక్ లోనే ధర్నాకు దిగారు సీఎం కేసీఆర్. కేంద్రంపై మళ్లీ అదే పాట పాడారు. కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని ఇది ఈరోజుతో ఆగిపోదని.. ఆరంభం మాత్రమేనన్నారు. ఉత్తర భారత్ లోని రైతుల పోరాటలను కలుపుకొని భవిష్యత్ లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే.. కేంద్రం అనూహ్యంగా రైతు చట్టాలను రద్దు చేయడంతో మళ్లీ సైలెంట్ అయిపోయారు కేసీఆర్. పైగా కేసీఆర్ యుద్ధం ప్రకటనతోనే కేంద్రం రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గిందని టీఆర్ఎస్ శ్రేణులు డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు.
2021 అయిపోయింది.. కొత్త సంవత్సరం అన్నా కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేస్తారా? అని ప్రజలంతా ఎదురుచూశారు. జనవరి నెల అయిపోయింది. అయితే.. పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టగానే.. సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. నిర్మలా బడ్జెట్ ప్రసంగం గంటన్నర ఉంటే.. కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారు. కేంద్రంపై మళ్లీ యుద్ధం ప్రకటించారు. దశ, దిశ లేని బడ్జెట్.. నిరాశ, నిస్పృహల బడ్జెట్.. పనికిమాలిన పసలేని బడ్జెట్ అంటూ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీని, నిర్మలా సీతారామన్ ని అనరాని మాటలు అన్నారు. అదే సమయంలో భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. కొన్నాళ్లకు ప్రధాని మోడీ పార్లమెంట్ లో రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా కాదని చెబుతూనే కాంగ్రెస్ పై మండిపడ్డారు. అయితే.. ఈ విషయంలో కేంద్రాన్ని బద్నాం చేయాలని కేసీఆర్ ప్రయత్నించారనేది విశ్లేషకుల వాదన. ఆ తర్వాత జనగామ, భువనగిరి జిల్లాల్లో టీఆర్ఎస్ బహిరంగ సభలు జరిగాయి. మోడీ పాలనకు సంబంధించి తిట్ల పురాణం అందుకున్నారు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ యుద్ధం, భూకంపం అంటూ ఇతర రాష్ట్రాల నేతలను కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. అప్పుడెప్పుడో 2018లో ఫ్రంట్ అంటూ హడావుడి చేసి.. మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుంటూ.. కేంద్రంపై కేసీఆర్ చేస్తున్నది యుద్ధం ఎలా అవుతుందని అడుగుతున్నారు విశ్లేషకులు.