– కేసీఆర్ అవినీతి లెక్కేస్తున్నాం..
– త్వరలో జైలుకే..
– రెండేళ్లుగా బండి మంత్రం ఇదే..!
– మాటకు మాట.. పోటాపోటీ డైలాగ్ వార్
– కానీ.. రోజులు గడుస్తున్నాయేగానీ..
– కేసీఆర్ ను జైలుకు పంపింది లేదు!
– బండి జైలు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సెటైర్లు..!
2020 మార్చి 11.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయ్యారు. పార్టీలో కొత్త జోష్ వచ్చింది. అప్పటిదాకా కేసీఆర్ ను బీజేపీ నేతలు మాటకుమాట ఎటాక్ చేసింది చాలా అరుదు. ఏదో మనల్ని తిట్టారు.. మనమూ తిట్టాలి అన్నట్లుగా ఉండేది సీన్. కానీ.. బండి ఎంట్రీ తర్వాత సీన్ పూర్తిగా మారింది. టీఆర్ఎస్ సైడ్ నుంచి ఒక్క మాట వస్తే చాలు.. వెంటనే ఎదురు సమాధానం వచ్చేది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అయితే.. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక చాలా సందర్భాల్లో ఎక్కువగా చెప్పింది ఒక్కటే. కేసీఆర్ ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమని. కానీ.. రోజులు గడుస్తున్నాయే గానీ.. అదంతా మాటలకే పరిమితం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓసారి బండి మాటలను రివైండ్ చేసుకుని చూస్తే…
2021 మార్చి 17..
బీజేపీ కార్యకర్తలకు పోరాటాలు, జైళ్లు కొత్తేం కాదంటూ.. కేసీఆర్ పై మండిపడ్డారు బండి. పేద గిరిజనుల కోసం ఆందోళన చేస్తుంటే కేసీఆర్ తమపై ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారని.. భవిష్యత్తులో ఆయనకు జైలు గతే పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఫాంహౌస్ నుంచి బయటకు రాకుండా జైలుకు వెళ్తే ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేస్తున్నారని విమర్శించారు.
2021 జూన్ 3..
కేంద్ర మంత్రిగా పని చేసినప్పుడు కేసీఆర్ అంత అవినీతిపరుడు దేశంలోనే ఎవరూ లేరన్నారు బండి. ఆయన అవినీతికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించామని.. సహారా, ఈఎస్‌ఐ కేసుల వివరాలు తీస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అవినీతి చిట్టా చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు.
2021 డిసెంబర్ 21..
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్ బియ్యం కుంభకోణం సహా ఇతర స్కామ్ లను వెలికి తీయాలని సూచించారు. వాటి గురించి ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు షా.
2022 జనవరి 04..
కేసీఆర్ అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అప్పటికి బండి సంజయ్ ను అరెస్ట్ చేయగా.. హైదరాబాద్ వచ్చిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని మండిపడ్డారు. కోట్లకు పైగా ఖర్చు పెట్టి కేసీఆర్.. తన ఫాంహౌస్ కు నీళ్లు తెచ్చుకుంటున్నారని విమర్శించారు.
2022 జనవరి 5..
కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. జైలు తమకు కొత్తేం కాదంటూ కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరన్నారని హెచ్చరించారు.
2022 జనవరి 12
తెలంగాణ ముఖ్యమంత్రి పెద్ద అవినీతిపరుడని ఆరోపించారు సంజయ్. కేసీఆర్ పై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోందని.. ఆయన్ను జైలుకు పంపించడం ఖాయమని అన్నారు. ఈ విషయం తెలిసే కేసీఆర్ ఫ్రంట్ పేరుతో మళ్లీ హడావుడి మొదలుపెట్టారని విమర్శించారు. అయితే.. బండి హెచ్చరికల నేపథ్యంలో అదే రోజు ప్రగతి భవన్ నుంచి కేంద్రంపై విరుచుకుపడ్డారు కేసీఆర్. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
2022 ఫిబ్రవరి 2
అప్పటికే కేంద్ర బడ్జెట్ పై పెదవి విరుస్తూ కేంద్రంపై మండిపడ్డారు కేసీఆర్. దీనికి కౌంటర్ ఇస్తూ కేసీఆర్.. భాషను చూసి కుక్కలు నక్కలు కూడా సిగ్గు పడుతున్నాయన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ, సహారా స్కాంలు చేశావ్… అవన్నీ తీస్తున్నా.. సీఎంగా వేల కోట్లు దోచుకుతింటున్నవ్.. అవన్నీ బయటకు వస్తున్నాయ్.. జైలుకు పోతానని అర్ధమై డిప్రెషన్ లోకి వెళ్లి ఇదంతా చేస్తున్నావ్ అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా.. సెంటిమెంట్ రగిల్చాలనుకున్నా అది సాధ్యం కాదు.. ఎందుకంటే కేసీఆర్ కు సంగతి అర్ధమైపోయింది.. ఆయన అరెస్ట్ కావడం తథ్యం అని జోస్యం చెప్పారు.
2022 ఫిబ్రవరి 12
తన అవినీతిపై విచారణ ప్రారంభమైందేమోనని కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని విమర్శించారు బండి. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందని.. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లెక్క దేశం వదిలి పారిపోదామనుకుంటున్నావేమో.. దొంగ పాస్ పోర్టులు అలవాటే.. అయినా నీ ఆటలు సాగవు.. నిన్ను రాష్ట్రం వదలి పోనియ్యం.. జైల్లో పెట్టుడు ఖాయం అని హెచ్చరించారు. దీనిపై తర్వాతి రోజు ప్రెస్ మీట్ లో కేసీఆర్ స్పందించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని కౌంటర్ సవాల్ చేశారు.
ఇటు చూస్తే.. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి కేసీఆర్ ను జైలుకు పంపుతామని బండి చెప్పడమే గానీ.. జరిగింది లేదు. అటు చూస్తే.. దమ్ముంటే తనను జైలులో పెట్టాలని కేసీఆర్ సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలు దొందూ దొందే అని విమర్శలు చేస్తోంది. బీజేపీ కేవలం మాటలకే పరిమితం అవుతోందని.. కేసీఆర్ ను జైల్లో పెడతామని చెప్పి సాగదీస్తోందేగానీ.. ఏం చేయడం లేదని విమర్శిస్తోంది.