– ధాన్యం విషయంలో టీఆర్ఎస్ ది డ్రామానా?
– కేంద్రంతో సంధికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా?
– మోడీ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు ఎందుకు?
– దాన్ని కవర్ చేసేందుకే ధర్నాల పేరుతో డ్రామాలా?
– ఇదంతా ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా?
– నిరుద్యోగుల మంత్రం ఎందుకు జపిస్తున్నట్టు?
– సారులో భయం ఎక్కువైందా?
నిరుద్యోగులకు గాలం.. వర్కవుట్ కాకపోవడంతో స్టైపండ్ పేరుతో తిప్పలు.. అన్నదాతల పేరుతోనూ డ్రామాలు.. కేంద్రంపై యుద్ధమంటూ మోడీ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు. తెలంగాణ సాధించినా.. చావుకు ఎదురెళ్లి కొట్లాడినా.. అంటూ పదే పదే చెప్పుకునే కేసీఆర్ భయంలో ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పండితులు నుంచి. ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానని ప్రజల ముందు ప్రగల్భాలు పలుకుతారు.. తీరా ఆయన ఏం చేస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మోడీని కలిసి వంగి వంగి దండాలు పెట్టి వస్తారని అంటున్నారు. తర్వాత భూకంపం ఉండదు.. యుద్ధం ఉండదు.. ధాన్యం విషయాన్నే చూడండి. ముందేమో కేంద్రం చెప్పినట్లు తల ఆడిస్తూ సంతకాలు చేశారు. ఇప్పుడు యుద్ధమని అంటున్నారు. చేయాల్సిందంతా చేసి కేంద్రానిదే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పు కళ్ల ముందే కనిపిస్తున్నా.. దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని చెబుతున్నారు.
తిమ్మిని బమ్మిని చేస్తూ తనకు సమస్య ఎదురైనప్పుడల్లా కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతూ తప్పించుకుంటున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. తాజాగా చేస్తున్న వరి వార్ పై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీలో మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి భయంతో యూటర్న్ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ధాన్యం విషయంలో తప్పంతా ఆయనదేనని స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తుండడం ఢిల్లీ పెద్దలకు సహించడం లేదు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలకు సంబంధాలున్న కంపెనీల్లో ఐటీ రెయిడ్స్ జరగడంతో సారు మెత్తబడ్డారని అంటున్నారు.
ఇక 8ఏళ్లుగా అదిగో ఇదిగో అని కాలయాపన చేసి 80వేల ఉద్యోగాలే ఉన్నాయని ఏవేవో లెక్కలు చెప్పి.. వెంటనే నోటిఫికేషన్ వస్తుందని ఈమధ్యే ప్రకటన చేశారు కేసీఆర్. పోనీలే.. ఇన్నాళ్లకన్నా సారుకు దయ కలిగి ఎన్నో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారని నిరుద్యోగులు భావిస్తే.. అది కూడా పెద్ద మాయేనని తేలిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రకటన చేసి ఇన్నాళ్లయినా వాటికి సంబంధించి ఎటువంటి అడుగు పడలేదు. పైగా.. దానిపై వస్తున్న వ్యతిరేకతను కవర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.
తాజాగా మంత్రి గంగుల కమలాకర్ ఓ ప్రకటన చేశారు. బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసిందని.. 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం, డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన 103 స్టడీ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడే అసలు కిటుకు ఉందంటున్నారు విశ్లేషకులు. త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారే గానీ.. ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 50 వేల ఉద్యోగాలు అని ఎన్నోసార్లు చెప్పారు కేసీఆర్. కానీ.. ఇంతవరకు ఏం చేయలేదు. దాన్నిబట్టి ఈ కోచింగ్ కూడా పెద్ద డ్రామాగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కదారి పట్టించడానికే స్టైపండ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. 2014లో ఉద్యమ సెంటిమెంట్ తో అధికారాన్ని దక్కించుకున్న కేసీఆర్.. రెండోసారి గెలుపు కష్టాలు ఎదురవడంతో ముందస్తు మంత్రం జపించి గట్టెక్కారు. ఆ సమయంలో అనేక హామీలు గుప్పించారు. వాటిలో నిరుద్యోగ భృతి ఒకటి. ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.3,016 ఇస్తానని అన్నారు. కానీ.. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చింది శూన్యం. ప్రతీ ఏడాది లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటిస్తున్నారే గానీ.. ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతికి కేటాయించలేదు. దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మొన్న ఉద్యోగాల ప్రకటన సమయంలో కూడా నిరుద్యోగులు అంతగా సంబరాలు జరిపింది లేదు. దీన్ని గ్రహించే వారిని చల్లబరిచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో గ్రంథాలయాలు అధ్వాన్నంగా ఉన్నాయని.. ఇన్నాళ్లూ వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పడం డ్రామా కాక ఇంకేంటనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అటు కేంద్రానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. ఇంకోవైపు ప్రజా వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే.. ఆయన ఎంత చేసినా ఈసారి ఓటమి తప్పదని అంటున్నాయి ప్రతిపక్షాలు. టీఆర్ఎస్ సర్కార్ పై అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయని చెబుతున్నాయి. అందుకే కేంద్రానితో మరోసారి కాళ్లబేరానికి ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా రాష్ట్రంలో ధాన్యం పేరుతో అనవసర డ్రామాలు ఆడుతున్నారని అంటున్నాయి ప్రతిపక్షాలు.