– కేసీఆర్ జాతీయ పార్టీ వ్యూహాలు!
– వర్కవుట్ అయ్యేనా?
– ఇది కూడా.. ఫ్రంట్ మాదిరి టెంట్ పీకేయడమేనా?
– లోక్ సభ ఎన్నికల్లో దేశమంతా పోటీ చేస్తారా?
– లేక.. తెలంగాణ చుట్టుపక్కలకే పరిమతం అవుతారా?
– అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే పరిస్థితేంటి?
ఫ్రంట్ అన్నారు.. బీజేపీ, కాంగ్రెసేతర కూటమికి తెగ ఆరాటపడ్డారు.. పార్టీ నేతల్ని, సినిమా స్టార్లను వెంటపెట్టుకుని రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టారు. ఆఖరికి, ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు. సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్లుగా జాతీయ పార్టీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. మరి.. ఇదన్నా వర్కవుట్ అవుతుందా? ఫ్రంట్ మాదిరిగా టెంట్ పీకేయడమేనా? ఒకవేళ ఇది పక్కా అనుకుంటే.. దేశమంతా పోటీ చేసే సత్తా ఉందా? లేక.. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలకే పరిమితం అవుతారా? 5న కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? తర్వాతి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? ఇలా ఎన్నో ప్రశ్నలు అటు టీఆర్ఎస్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈనెల 5న జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ప్రకటన ఉంటుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తేల్చేశారు. రాష్ట్ర కమిటీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొత్త పార్టీపై తీర్మానం ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగానే జాతీయ రాజకీయాలు ఉంటాయని.. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటనలు చేస్తారని తెలిపారు. అయితే, కేసీఆర్ జాతీయ పార్టీ ఖాయమని నాలుగైదు రోజులుగానే తెగ ప్రచారం సాగుతోంది. దానిని కన్ఫామ్ చేస్తూ పల్లా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ ను ఎదురించి పోరాడడం అంటే అంత ఈజీ కాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కేసీఆర్ కి కూడా ఈ విషయం తెలుసని అందుకే దేశమంతా పోటీకి ఆయన ప్రిఫర్ చేయడం లేదని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పేరు దాదాపు ఖరారైందని.. భారతీయ రైతు సమితిగా ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. 5న తెలంగాణ భవన్ లో జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు.. కారునే జాతీయ పార్టీకి కూడా వర్తింపచేయాలని తీర్మానం చేస్తారని చెబుతున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా వారు పాల్గొంటారట. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని ప్రస్తుతానికి నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రస్తుత తెలంగాణ, కర్నాటకలోని బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పర్భణీ, నాందేడ్, బీడ్ ప్రాంతాలపై ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏరియాలతో పాటు దేశవ్యాప్తంగా బలమైన రైతు ఉద్యమ నేతలను ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలనేది సారు ఆలోచనగా చెబుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 50 లోక్ సభ స్థానాల్లో కారు గుర్తుపై అభ్యర్థులను దించేలా కేసీఆర్ వ్యూహాల్లో ఉన్నారని సమాచారం. ఇటు ఏపీలోనూ బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీతో దగ్గరగా తిరుగుతున్న వైసీపీని కొద్ది రోజులుగా తెలంగాణ మంత్రులు టార్గెట్ చేశారని అంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి.. ఫలితాల ఆధారంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే, అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ భవిష్యత్ ను డిసైడ్ చేస్తాయని అంటున్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత బాగా పెరిగిందని.. అన్ని వర్గాల్లో అసహనం ఉందని.. గెలిచే పరిస్థితి లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ ఓటమి ఖాయమైతే.. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ జాతీయ పార్టీ తేలిపోతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.