– చినజీయర్ వీడియో వెనుక కుట్ర ఉందా?
– పాత వీడియో ఇప్పుడెందుకు బయటకొచ్చింది?
– చినజీయర్ పై కేసీఆర్ పగబట్టారా?
– లేక.. బీజేపీ ఓటు బ్యాంక్ ను చీల్చే ప్రయత్నమా?
వన దేవతలు సమ్మక్క, సారలమ్మల గురించి చినజీయర్ మాట్లాడిన వీడియో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గిరిజన సంఘాల నేతలు, రాజకీయ నాయకులు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే నగర బహిష్కరణ చేయాలని అంటున్నారు. కోట్లాది మంది ఆరాధించే వన దేవతలను కించపరచడం చినజీయర్ చేసిన తప్పే అయినా.. అప్పుడెప్పుడో అన్న పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేయడం వెనుక పెద్ద కథే ఉందనే ప్రచారం జరుగుతోంది.
సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయో చూశాం. ప్రధాని మోడీ చేతులమీదుగా అంగరంగవైభవంగా ఆవిష్కరణ జరిగింది. అయితే.. అప్పటిదాకా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. సడెన్ గా ప్రధానిని రిసీవ్ చేసుకోలేదు. అసలు.. ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడలేదు. సమతామూర్తి శిలాఫలకంపై మోడీ ఫోటో, పేరు పెట్టి.. తన పేరు లేకపోవడంతో కేసీఆర్ అలకబూనారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏకంగా చినజీయర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కోసం కళ్యాణోత్సవాన్ని వాయిదా వేయించి మరీ.. ఆయనకు పిలుపు అందించారు. కానీ.. చినజీయర్ అభ్యర్థనను పట్టించుకోని కేసీఆర్ కళ్యాణోత్సవానికి సైతం వెళ్లలేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సమ్మక్క, సారలమ్మల గురించి చినజీయర్ మాట్లాడిన పాత వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. నిజానికి ఇది ఎన్నో ఏళ్ల క్రితం మాట్లాడింది. సోషల్ మీడియా అంతగా ప్రభావం చూపని రోజుల్లో చినజీయర్ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో చేశారు. ఆయన ప్రవచనాలపై ఎన్నో వివాదాలూ ఉన్నాయి. కానీ.. ఆయనకున్న ఇమేజ్ ముందు వాటిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. కేసీఆర్ అలకబూనిన వెంటనే ఆనాటి పాత వీడియో బయటకు రావడంపై విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ వరకూ చినజీయర్ ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఎప్పుడైతే శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకుండా ప్రధాని మోడీతో ఆవిష్కరింపచేశారో అప్పట్నుంచి ఆయనకు శని దశ ప్రారంభమైందని అంటున్నారు విశ్లేషకులు. ఎప్పుడైతే కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించారో అప్పటి నుంచే ఇబ్బందులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. నిజానికి కేసీఆర్ ఒక్కసారి పగోడిగా ఫిక్స్ అయితే.. ఆ క్షణం నుంచి కష్టాలు దండయాత్ర చేయడం కామన్ అని గతంలో జరిగిన వాటిని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి నేతల జీవితాలే అందుకు నిదర్శనమని అంటున్నారు.
ఇక్కడ మరో విషయంపై కూడా చర్చ జరుగుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో చినజీయర్ కీలక పాత్ర పోషించారు. కానీ.. ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండానే మహా సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటివరకు దీనిపై చినజీయర్ కు కనీస ఆహ్వానం కూడా లేదని అనుమానిస్తున్నారు. ఇటీవల యాదాద్రి నుంచి కొంతమంది అర్చకుల్నిపిలిపించుకున్న చినజీయర్ త్వరలో వస్తానని తన చేతుల మీదుగానే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కానీ.. అలాంటి వాటికి అవకాశం లేకుండా.. ఆయన ప్రమేయం లేకుండా కార్యక్రమాలకు ప్లాన్ జరిగిపోయిందని చెబుతున్నారు.
మరోవైపు ఇంకో వాదన కూడా జరుగుతోంది. సమ్మక్క సారలమ్మను కోట్లాదిమంది ఆరాధిస్తుంటారు. ఇప్పుడు వారందరికీ చినజీయర్ శత్రువు అయిపోయారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ రాక సందర్భంగా బీజేపీ నేతలే అంతా దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్ కు దూరంగా.. బీజేపీకి దగ్గరకు చినజీయర్ వెళ్తున్నారని బాగా ప్రొజెక్ట్ అయింది. ఇదే టైమ్ లో సమ్మక్క సారలమ్మలపై ఆయన చేసిన వీడియో బయటకు రావడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ విషయంలో కలగజేసుకుని మాట్లాడడం బీజేపీకి నష్టం చేకూర్చే ప్లాన్ గా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఆదివాసీలలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇప్పుడు దాన్ని చీల్చే కుట్ర కూడా జరిగే అవకాశం అయి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.