కేసీఆర్‌లో ఎందుకంత అసహనం? ఆదివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగం ఆధ్యంతం అసహనంతో సాగింది. బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో రాష్ట్ర బడ్జెట్.. వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులు.. ప్రభుత్వ ప్రాధాన్య రంగాలు.. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు.. అమలవుతున్న పథకాలు.. వాటికి కేటాయిస్తున్న నిధులు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మాంద్యం.. ఇలా అనేక విషయాల గురించి చెప్పవచ్చు. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వొచ్చు. రాజకీయ విమర్శలు కూడా చేయొచ్చు. కానీ కేసీఆర్ ప్రసంగం అంతా వింటే ఎందుకు ఈయన ఇంత అసహనానికి గురవుతున్నాడు అనే అనుమానం రాక తప్పదు ఎవరికైనా.
దేశంలో జరుగుతున్న అన్నింటికీ మీరే కారణం.. మీ నిర్వాకం వల్లనే ఈ పరిస్థితి.. అంటూ కేసీఆర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఒకదశలో తన చేతిలో ఉన్న పేపర్స్ తీసి బెంచ్‌పై విసిరికొట్టారు. దీనిపై రాజకీయ వర్గాలలో బాగా చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా మాట్లాడి ఉంటాడని అంటున్నారు. టీఆరెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకాలు అమలుచేయడం కూడా కష్టం అవుతోంది. ప్రజలలో క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఏడు స్థానాలు కోల్పోవడం, ఇటీవల కాలంలో పార్టీలో కూడా అసంతృప్తి నెలకొనడం, కొందరు నేతలు బహిరంగంగా తమ గళాల్ని విప్పడం, మరోవైపు బీజేపీ తన దూకుణ్ణి పెంచడం.. అసెంబ్లీలో కాంగ్రెస్‌లో మిగిలిన ఐదుగురు సభ్యులు కూడా సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటం, వీటికి తోడు అనేక విషయాలలో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం, కేంద్రం సహకరించక పోవడం, ప్రధాని అపాయింట్మెంట్ దొరకకపోవడం.. ఈ నేపథ్యంలో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రావడం కేసీఆర్ అసహనానికి కారణం కావచ్చు అందున్నాయ్ రాజకీయవర్గాలు. ఇదే సెషన్‌లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్ష నాయకుడు భట్టి విక్రమార్కపై కఠినంగా మాట్లాడిన కేసీఆర్ మరుసటి రోజు వివరణ ఇస్తూ నేను అలా మాట్లాడివుండాల్సింది కాదు అంటూ ఒకటికి మూడుసార్లు అన్నారు. భట్టికి ఫోన్ చేసి మరీ తాను సభలో మాట్లాడిన దానిమీద వివరణ ఇచ్చారని తెలిసింది. మొత్తానికి కేసీఆర్‌లో గతంలో ఎప్పుడూ కనపడని అసహనం కనపడుతోందని, పార్టీ నాయకులను కూడా కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తనకు ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హరీష్‌రావుకి మంత్రిపదవి ఇవ్వడం ఆయనకు ససేమిరా ఇష్టంలేదు. అలాగే ఈటెలను క్యాబినెట్ నుంచి తొలగించాలని భావించినా ఆ పని చేయలేకపోయారు. పరిస్థితుల కారణంగా పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన వారి పట్ల ఉదారంగా ఉండాల్సిరావడం కూడా కేసీఆర్‌కి మింగుడు పడని అంశాలు. దీంతో కొంత అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.