– మారని కొందరి నేతల తీరు!
– రేవంత్ కష్టపడుతున్నా లేని సహకారం!
– గందరగోళంలో క్యాడర్
– సమిష్టిగా ముందుకెళ్తేనే గెలుపు ఖాయం
– కాంగ్రెస్ కుమ్ములాటలపై విశ్లేషకుల అభిప్రాయం
పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ప్రయత్నాల్లో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెంబర్ షిప్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. క్యాడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే.. రేవంత్ ఎంత కష్టపడితే ఏం ఉపయోగం.. పార్టీ నేతల్లో ఐక్యత కొరవడడం రానున్న రోజుల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు రాజకీయ పండితులు. అధికారం మాట దేవుడెరుగు.. అందరూ ఏకం కాకపోతే మరోసారి ఘోర అవమానం తప్పదని అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రమోట్ చేసుకున్నా ప్రజలు మాత్రం కేసీఆర్ నే నమ్మారు. బలమైన క్యాడర్ ఉన్నా నాయకత్వ లేమితో రెండోసారి కూడా అధికారానికి దూరమైంది హస్తం పార్టీ. అయితే.. వరుసగా రెండుసార్లు ఓడిపోయినా క్యాడర్ బలంగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వచ్చాక పార్టీలో కొత్త జోష్ వచ్చింది. అధికారమే లక్ష్యంగా ఆయన పనులు మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు.
రేవంత్ అయితే దూకుడుగా రాజకీయం నడుపుతున్నారు. ఫలితంగా చాలావరకు పికప్ అయింది. కానీ.. పార్టీ కీలక నేతల్లో లేని సఖ్యత కారణంగా క్యాడర్ గందరగోళంలో పడిపోతోందనేది విశ్లేషకుల వాదన. ఎంతసేపు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం విమర్శలు చేసుకోవడమే గానీ.. సమిష్టిగా పార్టీని నిలబెడదామని అనుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు కూడా నిరాశలోకి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు.. కొందరు నేతలైతే మన టార్గెట్ టీఆర్ఎస్ అనే విషయమే మర్చిపోయి.. సొంత పార్టీ నేతలకే విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారని గుర్తు చేస్తున్నారు.
టీఆర్ఎస్ పై పోరాడాలి.. బీజేపీ దూకుడికి కళ్లెం వేయాలనే ఆలోచనే కొందరు హస్తం నేతలు చేయడం లేదని అంటున్నారు విశ్లేషకులు. దీనివల్ల పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతోందని చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అనేలా మారింది పరిస్థితి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకపోతే మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికైనా ఓ ఆలోచన చేసుకుని పార్టీని గెలిపించాలని రేవంత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని సూచిస్తున్నారు.