– కేంద్రంపై కేసీఆర్ దూకుడుకు కారణాలేంటి?
– రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మోడీ సర్కార్ దృష్టి పెట్టిందా?
– ఏవైనా చర్యలు తీసుకుంటే..
– కక్షగట్టి చేశారనే కలరింగ్ ఇచ్చే ప్లాన్ కేసీఆర్ వేశారా?
– తెలంగాణ సెంటిమెంట్ ను ఎందుకు రగిలిస్తున్నారు?
– రెండు సభల ద్వారా కేసీఆర్ ఇచ్చిన సందేశం ఏంటి?
– రాజకీయ పండితుల విశ్లేషణ
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది కేసీఆర్ కల. 2018 ఎన్నికల ఫలితాల తర్వాత.. దేశ రాజకీయాల్లో కచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాం.. దేశానికి తెలంగాణ దిక్సూచి అని అన్నారు కేసీఆర్. మధ్యలో వారినీ వీరినీ కలిసి కాస్త హడావుడి చేసినా.. తర్వాత సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో అంతకుముందు 12 స్థానాల్లో ఉన్న టీఆర్ఎస్.. 9కి పడిపోయింది. బీజేపీ స్థానాలు పెరిగాయి. దీంతో ఫ్రంట్ లేదు.. టెంట్ లేదని గమ్మునుండిపోయారు కేసీఆర్. కానీ.. కొద్ది రోజులుగా ఆయన తీరులో మార్పు వచ్చింది. ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు టచ్ లోకి వెళ్లారు. పైగా మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. కేంద్రంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇలా కేంద్రంపై కేసీఆర్ చెలరేగడం వెనక పెద్ద స్కెచ్ ఉందనేది రాజకీయ పండితుల అభిప్రాయం.
పీకే ఎంట్రీ తర్వాత కేసీఆర్ కు జాతీయ రాజకీయాల ఆసక్తి ఎక్కువయిందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన డైరెక్షన్ లోనే కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారని చెబుతున్నారు. దీనివల్ల రెండు రకాలుగా ప్రయోజనం పొందాలనేది కేసీఆర్ ప్లాన్ గా విశ్లేషణ చేస్తున్నారు. అందులో ఒకటి.. తెలంగాణలో మూడోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడం. రెండోది.. దేశ రాజకీయాల్లో కీలకంగా మారడం. ఈ రెండు విషయాల్లోనే విజయవంతం కావడానికి కేసీఆర్ కు కనిపించిన మార్గం మోడీని టార్గెట్ చేయడమేనని చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇంతకు ముందులా లేవు. టీఆర్ఎస్ కు గట్టి సవాల్ విసురుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్. ముఖ్యంగా బీజేపీ బలోపేతమవడం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఆ పార్టీని టార్గెట్ చేసి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే బీజేపీ కూడా ఆ ట్రాప్ లో పడుతున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు.
పార్లమెంట్ లో రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను పట్టుకున్న టీఆర్ఎస్.. వాటిని ప్రజల్లోకి వేరేలా తీసుకెళ్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. పైగా ఏదో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు.. జనగామ, భువనగిరి సభల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కేసీఆర్. ఢిల్లీ కోటను బద్దలు కొడతా.. ప్రజలు ఆదరిస్తే మోడీని దేశం నుంచి తరిమేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీగాక.. మమతా, స్టాలిన్, థాక్రే టచ్ లో ఉన్నారని చెప్పారు. దీన్నిబట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరోసారి దృష్టి పెట్టారని అంటున్నారు విశ్లేషకులు. మోడీని విమర్శిస్తే జాతీయ వ్యాప్తంగా హైప్ వచ్చే అవకాశం ఉందని భావించే కేసీఆర్ ఈ రూట్ ఎంచుకున్నారని చెబుతున్నారు.
అయితే.. మరో చర్చను కూడా తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం దృష్టి పెట్టినట్లు బీజేపీ విమర్శలు చేస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కేంద్రంపై పోరాటం సాగిస్తే.. ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకున్నా.. కావాలనే కక్షగట్టి కేసులు పెట్టారనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కూడా ఇదంతా చేస్తున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.