– సీఎం కాక ముందు నుంచే ప్లాన్!
– పక్కా వ్యూహంతోనే వ్యవస్థల ధ్వంసం!
– ప్రజలకు దూరంగా సీఎం, మంత్రులు!
– ధరణితో రెవెన్యూ శాఖలో అల్లకల్లోలం
– సారు ప్లాన్స్ పై రాజకీయ ఉద్దండుల విశ్లేషణ!
సీఎం గద్దెపై కేసీఆర్ కూర్చున్నాక.. తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఎటు పోయాయో తెలియని పరిస్థితి. మిగులు రాష్ట్రం కాస్తా.. అప్పుల కుప్పగా మారింది. తాను అనుకున్నది సాధించడం కోసం వ్యవస్థలను నాశనం చేస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని ఇలా తయారు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా చెబుతోంది అదే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే కేసీఆర్ పథకం ప్రకారం వ్యవస్థలను ధ్వంసం చేయడం మొదలు పెట్టారని అంటున్నారు.
సోనియా గాంధీ నాయకత్వంలో కేంద్రంలోని యూపీఏ సర్కార్ తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్న రోజులవి. అప్పుడే తాను సీఎం ఎలా కావాలో అని కేసీఆర్ ఆలోచించడంతో పాటు.. అయ్యాక ఏ ఏ వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేయాలి.. తన చెప్పుచేతల్లో ఎలా పెట్టుకోవాలనే ఆలోచనతో పక్కా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు రాజకీయ ఉద్దండులు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడమో లేదా పొత్తు పెట్టుకోవడమో చేస్తాననే షరతు పెట్టారట కేసీఆర్. అందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా అప్పట్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అయ్యారని చెబుతున్నారు.
సీఎం అయిన మరుక్షణం నుంచే కేసీఆర్ తన ప్లాన్ ను అమలు చేయటం మొదలు పెట్టారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందులో భాగంగానే సచివాలయం, రెవెన్యూ వ్యవస్థలను దెబ్బ తీయడంతోపాటు పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారని చెబుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి రావడం.. ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడం, కలవడం ఆనవాయితీ. అలాగే జర్నలిస్టులు.. మంత్రులను, అధికారులను కలవడం.. వారిచ్చే సమాచారం ఆధారంగా వార్తా కథనాలు రాయడం ఎప్పటి నుంచో నడుస్తున్న తంతు. కానీ.. కేసీఆర్ కు ఇది నచ్చలేదని అంటున్నారు విశ్లేషకులు. అందుకే సచివాలయం ఫంక్షనల్ సిస్టంను దెబ్బ తీశారని చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో ఉన్న దాన్ని ఖాళీ చేయించి అంతా బీఆర్కే భవన్ కు షిఫ్ట్ చేశారు. దాంతో మంత్రులు చెట్టుకొకరు పుట్టకొకరుగా.. ఎవరి ఛాంబర్ ఎక్కడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అక్కడకు సాధారణ ప్రజలకు, జర్నలిస్టులకు నో ఎంట్రీ. సీఎం ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారు. ప్రజలను సీఎం, మంత్రులు కలవడం గగనం అయిపోయింది.
ఇక జర్నలిస్టులు కూడా మంత్రులను, అధికారులను కలవడం కష్టంగా మారింది. వారి నుంచి సమాచారం రాకుండా పోయింది. ప్రభుత్వం విడుదల చేసే జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం మానేశారు. కష్టపడి సమాచారం సేకరించి వార్త రాసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగెటివ్ న్యూస్ ఇస్తారా అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా సచివాలయం ఫంక్షనల్ సిస్టంను దెబ్బ తీశారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజలకు తెలియకుండా కేవలం సంక్షేమ పథకాల గురించి మాత్రమే వార్తలు రావాలనే ఆలోచనతో కేసీఆర్ ఈ పని చేశారని విశ్లేషణ చేస్తున్నారు. దీన్నిబట్టి సీఎంకు వ్యవస్థల మీద నమ్మకం ఉండదని అర్థం అవుతోందనేది వారి వాదన. అందుకే సచివాలయం వ్యవస్థను పక్కా ప్లాన్ ప్రకారం దెబ్బ తీశారని అంటున్నారు.
కేవలం సచివాలయమే కాదు రెవెన్యూ వ్యవస్థను కూడా సక్సెస్ ఫుల్ గా కేసీఆర్ దెబ్బ తీశారనేది రాజకీయ పరిశీలకుల మాట. ఏడాది పాటు సీఎం తన సొంత పత్రికలో రెవెన్యూ వ్యవస్థపై విష ప్రచారం చేయించి ఉద్యోగులు అవినీతిపరులు అనే ముద్ర వేయడం అందులోభాగమేనని చెబుతున్నారు. ఆ తర్వాతే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని.. చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ రికార్డ్ కార్యాలయం వ్యవస్థను అలా నాశనం చేశారని అంటున్నారు. ఇక ధరణి వ్యవస్థను తెచ్చి పాత రెవెన్యూ రికార్డ్స్ ను ధ్వంసం చేశారని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. ధరణి వెబ్ సైట్ ద్వారా రికార్డులలో లేని భూములపై కన్నేశారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ధరణి వెబ్ సైట్ లో సాగుదారు కాలం ఎత్తేయడం ద్వారా ఒకనాడు వామపక్ష ఉద్యమాల కారణంగా, నక్సల్స్ కారణంగా దొరలు వదిలేసిన భూములు కూడా వారికి ధారదత్తం చేశారని ఆరోపిస్తున్నారు. ధరణి అనేది కేసీఆర్ కు భూస్వాములకు వరంగా మారిందని చెబుతున్నారు విశ్లేషకులు. అందుకే కావాలనే పాత రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేశారని.. ఆ శాఖను కూడా తన దగ్గరే ఉంచుకోవడంలో ఆంత్యర్యం అదేనని అంటున్నారు. మొదటిసారి ప్రభుత్వంలో డమ్మీగా ఉండే మహమూద్ అలీకి రెవెన్యూ శాఖ ఇచ్చారని.. రెండో సారి తన దగ్గరే ఆ శాఖను కేసీఆర్ ఉంచుకున్నారని గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి అటు రెవెన్యూ ఇటు సచివాలయం వ్యవస్థలను చాలా పకడ్బందీగా దెబ్బ తీశారని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.
మరోవైపు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్ పోలీస్ వ్యవస్థను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి స్కెచ్ వేశారని చెబుతున్నారు. అందుకే కొత్త ఇన్నోవా వాహనాలు, ఇతర వరాలు ప్రకటించారు.. కమాండ్ కంట్రోల్ టవర్స్ నిర్మాణం పేరుతో తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారని అంటున్నారు. అందువల్లే ఏ ఎన్నికలు అయినా పోలీసులు టీఆర్ఎస్ కు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అటు.. పోలీస్ స్టేషన్లు టీఆర్ఎస్ కార్యాలయాలుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఖాకీలు పని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. తప్పొప్పులు, చట్టంతో పని లేకుండా సీఎం ఏది చెబితే అది చేయడానికి పోలీస్ వ్యవస్థ మారిపోయిందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తున్నారు. మొత్తానికి ఓవైపు ప్రతిపక్షాలను బలహీన పరిచి మరోవైపు వ్యవస్థలను కేసీఆర్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.