– ఒకప్పుడు సీఎం వస్తే సంబరాలు
– ఇప్పుడు.. అరెస్టులు, గృహనిర్బంధాలు
– పోలీసులు లేకుండా తిరగలేకపోతున్న గులాబీ నేతలు
– సీఎం అయినా.. కింది స్థాయి లీడర్ అయినా..
– ఎవరికైనా నిరసన సెగ..!
తెలంగాణ వచ్చిన కొత్తల్లో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారంటే సందడి వాతావరణం ఉండేది. దీనికి రెండు కారణాలను చెబుతున్నారు రాజకీయ పండితులు. ఒకటి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చానన్న క్రెడిట్ కొట్టేయడం.. రెండోది బలమైన ప్రతిపక్షం లేకపోవడం. కానీ.. రోజులు మారే కొద్దీ ఎన్నో మార్పులొచ్చాయి. జనానికి నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తూ వస్తున్నాయి. ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ దూకుడుగా ఉంటే.. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ కూడా బలం పుంజుకుంటోంది. ప్రతిపక్ష పార్టీలు ఉత్సాహంగా పని చేస్తున్నాయి.
ఇటు.. ప్రజలు కూడా అన్నీ అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలకు.. అమలు చేస్తున్న వాటిని బేరేజు వేసుకుని అన్నీ గమనిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా షాకులు ఇస్తున్నారు. అయితే.. కేసీఆర్ సర్కార్ పై దళితులు, రైతులు, నిరుద్యోగుల్లో అసహనం ఎక్కువగా ఉందనేది విశ్లేషకుల వాదన. దళిత సీఎం, మూడెకరాల విషయంలో సీఎం మాట తప్పారని దళిత సంఘాలు అంటున్నాయి. పైగా దళిత బంధు అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేయడం కూడా దళితుల్లో కేసీఆర్ పై వ్యతిరేకత పెరగడానికి కారణం అయిందని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇక రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎన్ని చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాం.. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలు చావే శరణ్యం అని భావిస్తుంటే.. ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని నిరుద్యోగులు తనువు చాలిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. పైగా ఎన్ని ఆత్మహత్యలు జరిగినా ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడం ఆయా వర్గాల్లో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయిందని విశ్లేషణ చేస్తున్నారు. ఫలితంగా భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ సీఎం జిల్లాల పర్యటన చేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు.
ఒకప్పుడు సీఎం వస్తున్నారంటే జైజేలు పలికిన జనాలు.. నిలదీసేందుకు భయపడిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు ఏకంగా పర్యటనలను అడ్డుకుంటున్నారు. దీంతో.. పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించి కేసీఆర్ జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు, ప్రతిపక్ష నేతలను రెండు రోజుల ముందే అదుపులోకి తీసుకొని పర్యటనను ముగించుకోవాల్సిన స్థితికి కేసీఆర్ దిగజారారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా జనగామ, యాదాద్రి పర్యటనలే అందుకు నిదర్శనమని అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
సీఎం వస్తున్నారని ఆయా జిల్లాల్లో ముందుగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై అటు బండి సంజయ్, ఇటు రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. పోలీసుల రక్షణ వలయం.. నేతలు, కార్యకర్తల అరెస్టులు.. గృహ నిర్బంధాలు లేనిదే కేసీఆర్, కేటీఆర్ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉందని సెటైర్లు వేస్తున్నారు. 2023 ఎన్నికల తర్వాత తండ్రీకొడుకులు ఇళ్లకే పరిమితం కావడం తథ్యమని చురకలంటిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. ప్రతిపక్షాల వాదన నిజం అయ్యేలా ఉందని రాజకీయ పండితులు సైతం వాదిస్తున్నారు. సీఎంలోనూ భయం పెరిగిపోయిందని అంటున్నారు. ఒక్క సీఎంకే కాదు గులాబీ నేతలు ఎక్కడ కనిపించినా ఈమధ్య తరచూ నిరసన సెగ తప్పడం లేదని జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు.